iDreamPost

వద్దనుకున్నారా వదిలేశారా.. బిజెపి, జనసేన మైత్రి ముచ్చటేనా?

వద్దనుకున్నారా వదిలేశారా.. బిజెపి, జనసేన మైత్రి ముచ్చటేనా?

బిజెపి, జనసేన మధ్య ఏర్పడిన మాటల యుద్ధం రాజకీయాల్లో కాక రేపుతుంది. తిరుపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ని నిలబెట్టిన తర్వాత దానికి మద్దతు పలికిన జనసేన కేవలం రెండు రోజుల వ్యవధిలోనే తన స్వరాన్ని మార్చింది. దీంతో బిజెపి, జనసేన మధ్య ఏర్పడిన మైత్రి మూన్నాళ్ళ ముచ్చటగా ముగిసినట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. జనసేన, బిజెపి నేతల వ్యాఖ్యలు చూస్తే అలాగే కనిపిస్తోంది.

చిచ్చుపెట్టిన తెలంగాణ ఎన్నికలు

బిజెపి జనసేన మధ్య తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు చిచ్చురేపాయి. తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ అవసరం లేదంటూ ఆ పార్టీ నేతలు కొందరు ఇటీవలే వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆగ్రహించిన పవన్ కళ్యాణ్ హైదరాబాదులో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఘాటుగా స్పందించారు. తెలంగాణ బిజెపి నేతలు అవమానిస్తున్నారని ఆయన ఆవేదన వెళ్లగక్కారు. జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో తమను వినియోగించుకున్న బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికలలో పక్కన పెట్టడం బాధాకరమన్నారు. ఇలాంటివి జనసేన సహించదని తెలిపారు. టిఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవీని గెలిపించాలని ఆయన ప్రకటించారు. దీనిపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ ధర్మాన్ని పాటించాలని ఏదైనా ఉంటే తన దృష్టికి గానీ పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాలని పవన్ కు సూచించారు. ఏది ఏమైనా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు బిజెపి జనసేన మధ్య చిచ్చు రేపాయని చెప్పొచ్చు.

రెండు రోజుల్లోనే మారిన సీన్

తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి నాయకులు జనసేనానిని సంప్రదించకుండానే తామే పోటీ చేస్తామని ప్రకటించారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ తో సంప్రదింపులు జరుపగా బిజెపి అభ్యర్థి కి పవన్ ఒకే చెప్పారు. అంతేకాకుండా తిరుపతి అభివృద్ధి కోసమే బీజేపీ అభ్యర్థిని బరిలోకి నిలబెట్టామని చెప్పుకొచ్చారు. ఇలా చెప్పిన రెండు రోజుల్లోనే తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల రోజున పవన్ కళ్యాణ్ టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి కి మద్దతు ప్రకటించారు. బిజెపి జాతీయ నాయకత్వం తమను గౌరవిస్తున్న రాష్ట్ర నాయకత్వం మాత్రం అవమానిస్తూ ఉందని ఆరోపించారు. దీనిపై బిజెపి కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చింది. పవన్ మాట్లాడే ముందు తమను సంప్రదించి ఉండాల్సిందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ వ్యాఖ్యలతో బిజెపి జనసేన పొత్తు ఉండదని తెలుస్తోంది.

ఖమ్మం కార్పొరేషన్లో ఒంటరిగా పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం వెనుక బీజేపీతో మైత్రి కి స్వస్తి చెప్పడం అని తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే విజయవాడ కార్పొరేషన్లో జనసేన కు ఒక్క సీటు కూడా రాకపోవడానికి బిజెపి కారణమని ఆ పార్టీ నాయకుడు పోతుల మహేష్ ఆరోపించారు. దీంతో తెలంగాణలో మొదలైన వివాదం ఆంధ్రాలో కూడా రాజుకుంది.

ముందుగానే ఎందుకు మైత్రి?

రాజకీయాల్లో పొత్తులు అనేవి సహజం. అయితే ఎన్నికలకు ఆరు నెలల ముందు గా రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి. కానీ జనసేన పార్టీ మాత్రం ఎన్నికలకు ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉండగానే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. గతంలో బీజేపీ టీడీపీ తో పొత్తు కొనసాగించిన జనసేన కొద్ది సమయంలోనే తెగతెంపులు చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ వామపక్షాలతో జతకట్టిన జనసేన వాటితోనూ ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బి.జె.పి.తో జత కట్టి కొద్ది కాలంలోనే పొత్తు వదులుకోనుఉంది.

మళ్లీ టీడీపీతో జత కడుతుందా?

బీజేపీతో వైరం పెంచుకున్న జనసేన 2024 ఎన్నికల్లో టిడిపితో కలిసి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. గతంలో చిత్తూరు రోడ్ షోలో బీజేపీపై నిప్పులు చెరిగిన పవన్ ఆ తర్వాత అదే పార్టీతో జత కట్టారు. తాజాగా జరిగిన వివాదంతో మళ్లీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటారని సోషల్ మీడియా వేదికగా పలువురు ట్రోలింగ్ చేస్తున్నారు. తిరుపతిలో కూడా బిజెపి అభ్యర్థికి జనసేన సహాయనిరాకరణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read : మునిసిపల్ ఎన్నికలు -ప్రతిపక్షాలకు మిగిలిన మార్గమేంటి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి