iDreamPost

ప్రైవేటు రంగంలోకి ఎల్‌ఐసీ..

ప్రైవేటు రంగంలోకి ఎల్‌ఐసీ..

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్‌ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ద్వారా నిధులు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఈ రోజు తన బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటాను విక్రయించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు.

భారత్‌ దేశంలో 1818లో ఇన్స్యూరెన్స్ సేవలు ప్రైవేటు రంగంలో ప్రారంభమయ్యాయి. ఓరియంటల్‌ ఇన్స్యూరెన్స్ కంపెనీ కోల్‌కత్తలో ఇన్స్యూరెన్స్ సేవలు అందించడం ప్రారంభించింది. స్వాతంత్రం అనంతరం 1956లో ఓరియంటల్‌ కంపెనీతోపాటు మరో 12 కంపెనీలను జాతీయం చేస్తూ ఎల్‌ఐసీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎల్‌ఐసీ ప్రభుత్వ రంగ సంస్థగా ప్రజల మన్ననలు అందుకుంది.

ప్రభుత్వ రంగంలోనే అత్యంత విజయవంతమైన సంస్థగా ఎల్‌ఐసీకి పేరుంది. దాదాపు 32 లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అంతేకాకుండా దాదాపు 28 లక్షల కోట్ల రూపాయల విలువైన పాలసీలు ఉన్నాయి. ఎల్‌ఐసీలో దాదాపు 1.12 లక్షల మంది ఉద్యోగులున్నారు. వీరితోపాటు దాదాపు 11 లక్షల మంది ఏజెంట్లు దేశ వ్యాప్తంగా సేవలందిస్తున్నారు.

కాగా, బ్యాంకులను ప్రైవేటు పరం చేసేదిశలో ఆయా బ్యాంకు ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కొన్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎల్‌ఐసీని ప్రైవేటు రంగంలోకి తీసుకెళ్లాలనే నిర్ణయంపై ఆ సంస్థ ఉద్యోగులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి