iDreamPost

జనసేన, ఆప్.. రెండింటి మధ్య ఎంత తేడా!

జనసేన, ఆప్.. రెండింటి మధ్య ఎంత తేడా!

ఈమధ్యే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్ రాష్ట్రంలో దుమ్ము దులిపింది. సామాన్యుడి చీపురు అధికారంలో ఉన్న కాంగ్రెసుతో సహా అన్ని పార్టీలను ఊడ్చి పారేసింది. కాకలుతీరిన యోధులను మట్టి కరిపించి అధికారం చేజిక్కించుకుంది. ఢిల్లీ దాటి పంజాబులోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడికి కొద్దిరోజుల వ్యవధిలో ఏపీలో జనసేన పార్టీ ఎనిమిదేళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకుని తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం సాధించడమే తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవ నినాదం, పార్టీ లక్ష్యమని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. విశేషం ఏమిటంటే అటు ఆప్.. ఇటు జనసేన దాదాపు ఒకే లక్ష్యంతో, దాదాపు ఒకేసారి 15 నెలల వ్యవధిలోనే ఆవిర్భవించాయి. అయితే రాజకీయాల్లో రాణించడానికి పవన్ కల్యాణ్ కు ఉన్న అనుకులతలు కేజ్రీవాల్ కు అప్పట్లో లేవు. కానీ కేజ్రీవాల్ ఒంటరి రాజకీయాలు చేస్తూ విజయపథంలో పరుగులు తీస్తుంటే.. జనసేనాని ఇతరులపై ఆధారపడుతూ, సిద్ధాంత రాహిత్యం, స్థిరత్వలేమితో విఫలనాయకుడిగా మిగిలిపోతున్నారు. బీజేపీ వారు ఇచ్చే రోడ్డుమ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని బహిరంగంగా చెప్పడమే దీనికి బలమైన నిదర్శనం.

8 ఏళ్లలో ఎన్ని గందరగోళాలో..

జనసేన పార్టీ పుట్టి ఎనిమిదేళ్లు పూర్తి అయ్యాయి. ఈ కాలంలో పార్టీకి స్థిరమైన రాజకీయ విధానాన్ని, సైద్ధాంతిక పునాదిని నిర్మించడంలో పవన్ విఫలమయ్యారు. 2014 మార్చి 14న ప్రారంభమైన పార్టీకి పటిష్టమైన కార్యకర్తల బలాన్ని, కనీస ఓటు బ్యాంకును సంపాదించలేక పోయారు. అభిమానగణం దండిగా ఉంది. ప్రజాకర్షణ శక్తి మెండుగా ఉంది. ఆర్థిక, సామాజికవర్గ బలాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. నిర్దిష్టమైన విధానాలు, సిద్ధాంతాలు లేకపోవడం, జనసేనాని పార్ట్ టైం రాజకీయాలు ఆ పార్టీని వైఫల్యాల బాటలోకి నెట్టాయి. సొంత అజెండాను పక్కనపెట్టి ఇతర పార్టీలకు గొడుగు పట్టడం, మద్దతు ఇవ్వడం వల్ల ఎప్పుడు, ఎవరికి ఓటు వేయాలన్న స్పష్టత లేక అభిమానులు కూడా గందరగోళంలో ఉంటున్నారు. 2014లో కొత్త పార్టీ అయినందున పోటీచేయడం లేదంటూ.. టీడీపీ, బీజేపీలకు ఓట్లు వేయమని పవన్ ప్రచారం చేశారు. 2019 ఆ రెండు పార్టీలను దూరం పెట్టి బీఎస్పీ, వామపక్షాలతో పొత్తుతో ఓట్ల వేట సాగించారు. కానీ కొన్ని చోట్ల టీడీపీతో లోపాయికారీ రాజకీయాలు నడిపారు. ఆ తర్వాత బీఎస్పీ, వామపక్షాలను కాదని మళ్లీ బీజేపీ పంచన చేరారు. అలాగని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీతో కలవకుండా అనేకచోట్ల టీడీపీతో రహస్య పొత్తులతో పోటీ చేశారు. ఇటువంటి చంచల నిర్ణయాలతో జనసేన విషయంలో ప్రజలకు ఒక క్లారిటీ లేకుండా చేశారు. చెప్పుకోదగ్గ ఒక్క విజయాన్నైనా నమోదు చేసుకోలేకపోయిన పవన్ వచ్చే ఎన్నికల్లోనూ ఇతర పార్టీలపైనే ఆధారపడటానికి సిద్ధం అవుతున్నారు.

స్పష్టమైన విధానాలతో ఆప్ విజయాలు

పవన్ కల్యాణ్ కు ఉన్న సానుకూలతలతో పోల్చిచూస్తే ఆప్ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ అనామకుడు. అన్నా హజారే ఉద్యమం ద్వారానే కొంత వెలుగులోకి వచ్చిన ఆయన ఎవరో 2012 నవంబర్ 26న పార్టీ పెట్టే వరకు ప్రజలకు పెద్దగా తెలియదు. జనాకర్షక శక్తి కూడా లేదు. కానీ నిబద్ధత, రాజకీయ విధానాల్లో స్పష్టత, చేయగలిగిందే చెప్పడం.. చెప్పింది తప్పనిసరిగా చేయడం వంటివి ఆయన్ను ప్రజా నాయకుడిగా నిలబెట్టాయి. ఇతర పార్టీలపై ఆధారపడకుండా.. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలనే నమ్ముకోవడం కూడా కలిసి వచ్చింది. పార్టీ పెట్టిన కొన్ని నెలలకే 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆప్ ను నిలబెట్టి జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెసులకే దడ పుట్టించారు. 70 సీట్ల అసెంబ్లీలో 28 స్థానాలు సంపాదించి కాంగ్రెసుతో కలిసి తొలి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. లోక్పాల్ బిల్లు కోసం రాజీనామా చేసి 2015 మధ్యంతర ఎన్నికల్లో రెట్టింపు బలంతో అధికారంలోకి వచ్చారు. మొత్తం 68 సీట్లు సాధించారు. ఢిల్లీలో మౌలిక రంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రజల అభిమానాన్ని చూరగొని 2020లోనూ 62 సీట్లతో మూడోసారి అధికారం చేపట్టారు. మరోవైపు పంజాబులోనూ ఆప్ ను విస్తరించారు. సామాన్యులకే అవకాశాలు కల్పిస్తూ ఢిల్లీ మోడల్ అభివృద్ధిని ప్రచారాస్త్రంగా మలచుకొని మొన్నటి పంజాబ్ ఎన్నికల్లో 92 సీట్లతో విజయదుందుభి మోగించారు. సిద్ధాంతాలు, విధానాలు తప్ప వాగాడంబరాలు, అస్థిర నిర్ణయాలతో రాజకీయాల్లో రాణించలేరనడానికి పవన్ కల్యాణ్, కేజ్రీవాల్ నిదర్శనంగా నిలుస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి