iDreamPost

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉప ముఖ్యమంత్రి

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉప ముఖ్యమంత్రి

తనపై ఓ మీడియా సంస్థ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా మండిపడ్డారు. ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన కడప ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తాను ఢిల్లీకి వెళ్లిన మాట వాస్తవమని, కానీ ఈ నెల 2వ తేది వెళ్లి మళ్లీ 3 న విజయవాడ వచ్చానని ఆయన వెల్లడించారు.

డిప్యూటీ సీఎం హోదాలో తనకు ప్రోటోకాల్ ఉందని, ప్రతి ఒక్కటీ రికార్డు అవుతాయని అన్నారు. ఢిల్లీలో కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు కేసుపై వెళ్లడం జరిగిందని అంజాద్ భాషా వివరించారు. ఈ నెల 5వతేది నుండి 26 వరకు కడప లోనే ఉన్నానని 27వ తేది విజయవాడలో క్యాబినెట్ మీటింగ్‌కు హాజరయ్యానని తెలిపారు. తిరిగి మర్చి 28న కడప వచ్చానని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

ఈ నెల 14,15,16 వ తేదీలలో టీడీపీ నుండి ముఖ్య నేతలు వైసీపీ లో చేరిన కార్యక్రమంలో పాల్గొన్నట్టు అంజాద్ భాషా స్పష్టం చేశారు. తనపై దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం తరపున నుండి కూడా ఆ ఛానెల్ పై చర్యలు తీసుకుంటామని అన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న తనపై ఇలాంటి దుష్ప్రచారం చేయడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. ఒకవేళ నేను ఢిల్లీ సభలకు వెళ్లలేదు అంటే ఆ మీడియా సంస్థను మూసేస్తారా అని సవాల్ విసిరారు.

ఇదే సమయంలో కడప జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా ఆంక్షలు మరింత కఠితరం చేయాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగానే జిల్లా సరిహద్దులను మూసివేస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు. దిల్లీ నిజాముద్దీన్‌ ప్రాంతంలో తబ్లిగి జమాత్‌కు వెళ్లొచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్య పరీక్షలకు సహకరించాలని కోరారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని మంత్రి భరోసా ఇచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి