iDreamPost

ప్రైవేటు స్కూళ్లలో కూడా తెలుగు మీడియంలో బోధన జరగాలి.. ఒక న్యాయవాది

ప్రైవేటు స్కూళ్లలో కూడా  తెలుగు మీడియంలో బోధన జరగాలి.. ఒక న్యాయవాది

ఆంధ్రప్రదేశ్ లో మునుపెన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థ పై తీవ్రమైన చర్చ జరుగుతోంది. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రభుత్వ పాఠశాలలో బోధన ఇంగ్లీష్ మాధ్యమంలో జరగాలని సంకల్పించింది. తెలుగు సబ్జెక్ట్ ను తప్పనిసరి చేస్తూనే ఇతర సబ్జెక్టులను ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని నిర్ణయించింది.

దీన్ని వ్యతికిస్తూ పలు రాజకీయ పార్టీల నేతలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. పేద పిల్లల తల్లిదండ్రులకు ఇంగ్లీషు రాదని.. ఇంగ్లీష్ మీడియంలో చదివితే వారికి వచ్చే సందేహాలను తల్లిదండ్రులు తీర్చలేరని పిటిషన్ దాఖలు చేసిన వారి భావన. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఇంగ్లీష్ రెండు మాధ్యమాలు ఉండాలని ఈ మాధ్యమంలో చదవాలనే ది విద్యార్థులు నిర్ణయానికే వదిలేయాలన్న పిటిషన్దారులను హైకోర్టు సమర్ధించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో లు 81, 85లను రద్దు చేసింది. దీని వెనక ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల హస్తం ఉందన్న విమర్శలు వినిపించాయి.

రాష్ట్ర హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం ఏ మీడియంలో చదవాలో విద్యార్ధీ ఇష్టం మరి ఈ తీర్పు ప్రకారం కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే బోధిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్లలో విద్య హక్కు చట్టం ప్రకారం తెలుగు మీడియం లో బోధన జరగాలని, అలా చేయని విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని ఏలూరు చెందిన హైకోర్టు న్యాయవాది జి. రోనాల్డ్ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, విద్యాశాఖ కమిషనర్, సర్వ శిక్ష అభియాన్ పీడీ, రాష్ట్ర కేంద్ర మానవ వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, జిల్లాల కలెక్టర్లకు, విద్యాశాఖ అధికారులకులెటర్ రాశాడు .

చట్టపరమైన, న్యాయపరమైన తన డిమాండ్ అమలుకు 20 రోజుల్లో తగిన విధంగా చర్యలు చేపట్టని నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తానని న్యాయవాది రోనాల్డ్ స్పష్టం చేశారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.? హైకోర్టు లో వ్యాజ్యం దాఖలు అయితే.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది..? ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది..? అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి