iDreamPost

జగన్ సునామీలో పార్టీ అధ్యక్షుల ఓటమి

జగన్ సునామీలో పార్టీ అధ్యక్షుల ఓటమి

గతంలో ఎప్పుడు లేని విధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడం మనం చూడవచ్చు. గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 2014 లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం అనంతరకాలంలో వైసిపి నుండి 23 మంది ఎమ్మెల్యేలను నయానో భయానో తెలుగుదేశంలోకి లాక్కున్న తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో విచిత్రంగా తెలుగుదేశం పార్టీ అంతే సంఖ్యలో విచిత్రంగా అదే 23 స్థానాలకు పరిమితమై ఘోర ఓటమిని మూటగట్టుకుంది.

ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ఆయా పార్టీల అధ్యక్షులను ఒక్కసారి గమనిస్తే మరొక ఆసక్తికర కోణం బయటపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న వారిలో ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తప్ప మిగతా అన్ని ప్రధాన పార్టీల రాష్ట్ర అధ్యక్షులందరూ ఒకే ఎన్నికల్లో ఓడిపోవడం సంచలనమనే చెప్పవచ్చు.

ముందుగా గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం రాష్ట్ర విభజన అనంతరం జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షునిగా కళా వెంకటరావు నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనగా, ఈ ఎన్నికల్లో సాక్షాత్తు గత తెలుగుదేశం ప్రభుత్వంలో కీలకమైన మంత్రిత్వ శాఖలు చేపట్టిన కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష హోదాలో శ్రీకాకుళం జిల్లా ఎచెర్ల నుండి పోటీచేసి తన ప్రత్యర్థి వైసిపికి చెందిన గొర్ల కిరణ్ కుమార్ చేతిలో ఓడిపోవడం విశేషం.

మరో మాజీమంత్రి శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రస్థాయి నేతగా గుర్తింపు పొందారు. తన వ్యవహార శైలితో మంత్రిగానూ మంచి మార్కులు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన పరిణామాలతో సీమాంధ్ర కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఆ పార్టీని వీడినా శైలజానాథ్ మాత్రం కాంగ్రెస్ ను వీడలేదు. శైలాజానాద్ అనంతపురం జిలా సింగనమల (యస్సి రిజర్వుడ్) నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసినఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలకి బాధ్యత వహిస్తూ రఘువీరా రెడ్డి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చెయ్యడంతో, అదే జిల్లాకి చెందిన మాజీ మంత్రి సాకే శైలజా నాథ్ వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరుస ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ నే అంటి పెట్టుకొని ఉండడంతో పాటు వెనుకబడిన వర్గానికి చెందిన నేత కావడంతో ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని రాష్ట్ర అధ్యక్షునిగా నియమించింది.

అదే విధంగా భారతీయ జనతాపార్టీ చూస్తే ఆపార్టీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరించి, వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఆయన 2014 కాంగ్రెస్ ఓటమి తరువాత బీజేపీలో చేరగా గత ఎన్నికలకు ముందు బిజెపి నుండి వైసీపీలో చేరుతున్నారని వార్తలొచ్చాయి. అయితే అనూహ్య పరిణామాలలో ఆయన చివరి నిమిషంలో బిజెపిలోనే కొనసాగి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష హోదాలో 2019 ఎన్నికల్లో నరసారావుపేట నుండి పార్లమెంటు అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.

మరో పార్టీ రాష్ట్ర నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే 2014 లోనే ఆయన జనసేన పార్టీని స్థాపించినప్పటికీ టిడిపి, బీజేపీలకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు తప్ప ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయలేదు. అయితే 2019 ఎన్నికల్లో జనసేన తరుపున ఆ పార్టీ అధ్యక్షుని హోదాలో గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి పాలయ్యారు.

అలాగే కేవలం రాజకీయాల సమయంలో అదీ ఎన్నికలప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు వచ్చే మత ప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి దారుణంగా ఓడిపోయారు. ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీ చేసిన కేఏ పాల్ కి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు.

2019 ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన పాదయాత్ర ప్రభావం, గత తెలుగుదేశం పాలనపై ప్రజలలో వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో గత ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన హేమాహేమీలైన నాయకులు సైతం ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే సాక్షాత్తు పలు రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా ఇలా ఒకేసారి ఒకే ఎన్నికల్లో ఓటమి పాలవడం రాష్ట్ర రాజకీయాల్లో అరుదయిన సంఘటనగా చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి