iDreamPost

రాజశేఖర్ పాత రీమేక్ తో రజని అల్లుడు

రాజశేఖర్ పాత రీమేక్ తో రజని అల్లుడు

సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ కు ఇక్కడ పెద్దగా మార్కెట్ లేకపోవచ్చు కానీ గుర్తింపు మాత్రం బాగానే ఉంది. దానికి కారణం రఘువరన్ బిటెక్. అప్పట్లో ఇది సాధించిన భారీ విజయం తర్వాత ఎన్నో డబ్బింగ్ చిత్రాలను వచ్చేలా చేసింది కానీ ఏ ఒక్కటీ ఆడకపోవడంతో ఆ తర్వాత ధనుష్ వి అనువదించడం మానేశారు. వడ చెన్నై లాంటి మాస్టర్ పీస్ కూడా మనకు చూసే అవకాశం దక్కలేదు. సరే అసురన్ బ్రహ్మాండంగా ఆడింది కదా అదైనా చూద్దాం అనుకుంటే వెంకటేష్ నారప్పగా రీమేక్ చేసుకోవడంతో ఆ ఛాన్స్ కూడా మిస్ అయ్యింది.

ఇక లేటెస్ట్ చెన్నై అప్ డేట్ ప్రకారం ధనుష్ త్వరలో ఓ పాత రీమేక్ చేసే ఛాన్స్ ఉందట. ఎప్పుడో ఇరవై ఎనిమిదేళ్ల క్రితం 1992లో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరోగా దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో అహంకారి వచ్చింది. కామంతో ఆడవాళ్ళను అదోలా చూసే బలహీనత ఉండే తండ్రి, మంచికి మారు పేరుగా నాన్న పోలికలతోనే ఉండే కొడుకు మధ్య సాగే కథ అది. కానీ ఇది ఆ టైంలో పెద్ద ఫ్లాప్. అలా అని అహంకారి కూడా ఒరిజినల్ ఐడియా కాదు. 1981లో రజని నెట్రికారన్ అనే సినిమా చేశాడు. దాన్నే తెలుగులో ముసలోడికి దసరా పండగ పేరుతో డబ్ చేశారు.

తమిళ్ లో సూపర్ హిట్ కాగా తెలుగులో బాగానే ఆడింది. ఇప్పుడు ధనుష్ చేయాలనుకుంటోంది ఇదే కథట. ఈ స్టోరీలో ఒక ట్విస్ట్ ఉంటుంది. కొడుకు ప్రేమించిన అమ్మాయి మీద తెలియకుండానే తండ్రి కన్ను పడి అఘాయిత్యం చేస్తాడు. ఆ తర్వాత రకరకాల ట్విస్టులు చోటు చేసుకుంటాయి. ఇప్పటి జెనరేషన్ కి ఇలాంటి లైన్ కనెక్ట్ అవుతుందా అంటే అనుమానమే. అయితే ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని అనుకుంటున్నట్టుగా కోలీవుడ్ సమాచారం . డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఆకట్టుకుంటున్న ధనుష్ దీంతోనైనా తెలుగు మార్కెట్ లో మళ్ళి కుదురుకుంటాడేమో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి