iDreamPost

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ నేడు.. కొత్త అధ్యక్షుడి ఎంపిక మీద చర్చ

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ నేడు.. కొత్త అధ్యక్షుడి ఎంపిక మీద చర్చ

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం, పరాభవం పొందింది. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ కు ఇదేం కొత్తకాదు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఘోర పరాజయం చవిచూసింది. రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ మినహా గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలోనూ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్‌ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నా.. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలన్నింటిలోనూ ఆయన ప్రభావం ఉందనే ప్రచారం ఉంది.

ఇక ఇప్పుడు తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచార బాధ్యతల్ని భుజానవేసుకున్న రాహుల్‌గాంధీ తో పాటూ, ప్రియాంకా గాంధీ వాద్రా మాయాజాలం కూడా పనిచేయలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ‘‘కోలుకోలేని దెబ్బ తలగిలింది’’. దీంతో అన్నాచెల్లెళ్ల ‘‘బ్రాండ్‌ విలువ’’ అనూహ్యంగా పడిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్‌చార్జ్‌ హోదాలో ప్రియాంక ఉత్తరప్రదేశ్‌లో 209 ప్రచారసభలు, రోడ్డు షోలు నిర్వహించారు. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ సైతం ఇన్ని సభల్ని, షోలను నిర్వహించలేదు (యోగి 203 సభల్లో మాత్రమే ప్రసంగించారు). యూపీతోపాటు పంజాబ్‌, గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ ఎన్నికల ప్రచారాల్లోనూ ఆమె పాల్గొన్నారు. రాహుల్‌గాంధీ కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. అయితే యూపీలో పార్టీ గెలుపుకోసం ప్రియాంక ఎంతో శ్రమించారు. మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల్ని ఆమె ప్రస్తావించారు. ఆమె సభలకు జనం కూడా పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అయినా ఓటర్ల మనసుల్ని గెలుచుకోవడంలో మాత్రం ఆమె ఘోరంగా విఫలమయ్యారని విశ్లేషకులు అంచనావేసున్నారు. మరోసారి ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడడంతో కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరాలు వినిపించే అవకాశాలున్నాయంటున్నారు.

ఈ క్రమంలో నేడు రేపు కాంగ్రెస్ పార్టీ సమావేశం జరగనుండడం ఆసక్తిగా మారింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు భేటీ జరగనుంది. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో మీటింగ్ నిర్వహించనున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ పరాభవం, కొత్త అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్న దృష్ట్యా సెప్టెంబర్లో నిర్వహించాల్సిన అంతర్గత ఎన్నికలను అంతకన్నా ముందే నిర్వహించడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే మరోసారి ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడడంతో కాంగ్రెస్‌లో అసమ్మతిస్వరాలు వినిపించే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి