iDreamPost

పెరుగు ఘటన: మెరిడియన్‌ హోటల్‌ మూసివేత!

పెరుగు ఘటన: మెరిడియన్‌ హోటల్‌ మూసివేత!

మెరిడియన్‌ హోటల్‌లో పెరుగు విషయంలో గొడవ కారణంగా ఓ వ్య​క్తి హత్యకు గురైన సంగతి తెలిసిందే. పోలీసుల కళ్ల ఎదుటే మృతుడు లియాఖత్‌పై దాడి జరిగినట్లు సీసీ కెమెరా దృశ్యాల ద్వారా బహిర్గతమైంది. గొడవను సకాలంలో ఆపడంలోనూ.. మృతుడికి వైద్య సహాయం అందించటంలోనూ పంజాగుట్ట ఎస్సై శివ శంకర్, హెడ్ కానిస్టేబుల్ రమేష్‌లు వైఫల్యం చెందినట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే వారిద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది. అంతేకాదు! ఘటన జరిగిన మెరిడియన్‌ హోటల్‌ను అధికారులు తాత్కాలికంగా మూసి వేశారు.

కాగా, ఆదివారం రాత్రి పాతబస్తీకి చెందిన 32 ఏళ్ల లియాఖత్‌ స్నేహితులతో కలిసి పంజాగుట్టలోని మెరిడియన్‌ హోటల్‌కు వెళ్లాడు. బిర్యానీలు ఆర్డర్‌ చేసి తింటూ ఉండగా.. మరింత రాయితా(పెరుగు పచ్చడి) కావాలని లియాఖత్‌ వెయిటర్‌ను అడిగాడు. అయితే, వెయిటర్లు ఎవ్వరూ పట్టించుకోకపోవటంతో వారితో వాగ్వివాదానికి దిగాడు. గొడవ చినికి చినికి గాలివానలా తయారైంది. హోటల్‌ సిబ్బంది లియాఖత్‌పై దాడి చేశారు. అతడి స్నేహితులు పోలీసులకు ఫోన్‌ చేశారు.

అక్కడికి వచ్చిన పోలీసుల ముందే సిబ్బంది లియాఖత్‌పై దాడి చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. తర్వాత అందరినీ స్టేషన్‌కు తరలించారు. లియాఖత్‌ తనకు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉందని చెబుతున్నా కూడా వినకుండా స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ అతడు కుప్పకూలాడు. దీంతో అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే చనిపోయినట్లు వైధ్యులు ధ్రువీకరించారు. మరి, మెరిడియన్‌ హోటల్‌లో రాయితా కోసం చోటుచేసుకున్న ఈ హత్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి