iDreamPost

Tabbar : కుటుంబం కోసం హత్యలు చేసే తబ్బర్

Tabbar : కుటుంబం కోసం హత్యలు చేసే తబ్బర్

దృశ్యం సినిమా గుర్తుందిగా. అందులో వెంకటేష్ కుటుంబం కోసం ఎంతగా తపించిపోతాడో, అనుకోకుండా జరిగిన హత్యను కప్పిపుచ్చి తన వాళ్ళను కాపాడుకునేందుకు ఎంతకు తెగిస్తాడో చూసాం. ప్రేక్షకులూ బ్రహ్మాండంగా ఆదరించారు. దాన్ని పదింతలు మోతాదులో ఒక క్రైమ్ థ్రిల్లర్ వస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా ఆ ఊహతోనే దర్శకుడు అజిత్ పాల్ సింగ్ రూపొందించిన వెబ్ సిరీస్ తబ్బర్. సోనీ లివ్ లో ఇటీవలే స్ట్రీమింగ్ జరిగిన ఈ సస్పెన్స్ డ్రామాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఒక్క బూతు డైలాగు, అడల్ట్ సీన్ లేకుండా నడిపించిన విధానం ఫ్యామిలీ ఆడియన్స్ ని సైతం ఆకట్టుకుంటోంది. అంతగా ఇందులో ఏముంది.

12 ఏళ్ళు పోలీస్ శాఖలో పని చేసి రిటైర్మెంట్ తీసుకుని కిరాణా కొట్టు నడుపుతూ ఉంటాడు ఓంకార్ సింగ్(పవన్ మల్హోత్రా). భార్యకు(సుప్రియా పాఠక్)జబ్బు ఉంటుంది. ఇద్దరు కొడుకులు. ఒకడు ఐపిఎస్ కోసం ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటుండగా మరొకడు స్థానికంగా ఉద్యోగం వెతుకుతూ ఉంటాడు. ఓ రాత్రి తమ తప్పేమి లేకపోయినా స్థానిక డాన్ తమ్ముడిని ఇంట్లోనే చంపేస్తారు. గుట్టు చప్పుడు కాకుండా శవాన్ని ఊరవతల పాడుబడిన బ్రిడ్జి కింద పారేసి వస్తారు. ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ. ఓంకార్ సింగ్ తన పిల్లలను కాపాడుకుంటే క్రమంలో మరో మూడు మర్డర్లు చేయాల్సి వస్తుంది. మిగిలింది తెరమీదే చూడాలి.

ఎనిమిది ఎపిసోడ్లతో 5 గంటల నిడివి ఉన్న ఈ వెబ్ సిరీస్ ఆద్యంతం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగుతుంది. అమృత్సర్ బ్యాక్ డ్రాప్ లో ఒక చిన్న కాలనీతో పాటు రెండు మూడు లొకేషన్లోనే తీసినా ఎక్కడా బోర్ కొట్టించకుండా నడిపించిన తీరు బాగుంది. అక్కడక్కడా తప్ప సాగతీతకు గురైన సన్నివేశాలు కూడా తక్కువే. చంద్రశేఖర్ యేలేటి తీసిన ఐతేలో విలన్ గా నటించిన పవన్ మల్హోతా ఇందులో ఓంకార్ సింగ్ గా విశ్వరూపం చూపించారు. పర్ఫెక్ట్ క్యాస్టింగ్ కి ఉదాహరణగా తబ్బర్ నిలుస్తుంది. ఒక తప్పుని సరిచేయడం కోసం తప్పు మీద తప్పు చేస్తే చివరికి అది కుటుంబంలోని ఎవరో ఒకరిని ఎలా బలి తీసుకుంటుందో తబ్బర్ లో చూడొచ్చు. ట్రై చేయండి

Also Read : MAA Elections : సినిమాలను మించుతున్న ‘మా’ ట్విస్టులు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి