iDreamPost

ఏపీలో త‌గ్గిన నేరాలు : అందుకు జ‌గ‌న్ ఏం చేశారంటే…

ఏపీలో త‌గ్గిన నేరాలు : అందుకు జ‌గ‌న్ ఏం చేశారంటే…

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఏపీలో ఘోరాలు జ‌రిగిపోతాయి.. నేరాలు పెరిగిపోతాయి.. అంటూ ప్ర‌తిప‌క్షాలు ఒక్క‌టే ఊద‌ర‌గొట్టాయి. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయితే అరాచ‌కాలు జ‌రుగుతాయంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. క్రైం రికార్డు బ్యూరో తాజాగా వెల్లడించిన రిపోర్టు వాళ్లంద‌రికీ క‌ళ్లు బైర్లు క‌మ్మేళా చేస్తుంద‌న‌డంలో అతిశ‌యోక్తి కాదు. సుమారు 18% నేరాలు తగ్గినట్లు ఆ రిపోర్టు చెబుతోంది. ఐపీసీ నేరాల‌లో 3.7% త‌గ్గుద‌ల న‌మోదైంది. హత్య కేసులు 7% తగ్గాయి. ఇందుకు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన చ‌ర్య‌లు.. ఏదేనీ దుర్ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు స్పందిస్తున్న తీరే కార‌ణాలు.

ఓర్పు, నేర్పుతో…

ఏపీలో నేరాలు పెరిగిపోతాయంటూ ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీపైనా, జ‌గ‌న్ పైనా ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే కాదు.. అధికారంలోకి వ‌చ్చాక అల్ల‌ర్లు పెరిగేలా కొన్ని సార్లు ప్ర‌య‌త్నించాయి కూడా. ప్ర‌ధానంగా ఆల‌యాల‌పై దాడుల‌ను ఆస‌రాగా చేసుకుని ఏపీలో అల్ల‌క‌ల్లోం సృష్టించేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించాయి. బీజేపీతో క‌లిసి తెలుగుదేశం కూడా హిందూత్వ వాదం పేరుతో ప్ర‌జ‌ల్ని రెచ్చ‌గొట్టేందుకు ప్ర‌య‌త్నించింది. ప్ర‌ధానంగా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం ద‌గ్ధం కావ‌డంపై పెద్ద దుమార‌మే రేపాయి. వాస్త‌వానికి అది చాలా సున్నిత‌మైన అంశం. అలాంటి ఘ‌ట‌న‌ల‌ను అదుపు చేయాలంటే చాలా నేర్పు, ఓర్పు కావాలి. సీఎం ఆ జ‌గ‌న్ ఆ రెండింటినీ చాలా చ‌క్క‌గా ప్ర‌ద‌ర్శించారు. ఎక్క‌డా ప్ర‌జ‌ల్లో భావోద్వేగాలు రేగ‌కుండా స‌త్వ‌ర చ‌ర్య‌ల ద్వారా అరిక‌ట్ట‌గ‌లిగారు. ప్ర‌తిప‌క్షాలు నోరెత్త‌క ముందే.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. నూత‌న ర‌థం నిర్మాణానికి వెనువెంట‌నే నిధులు విడుద‌ల చేయ‌డం, నిర్మాణ ప‌నుల‌పై దృష్టి పెట్ట‌డం ఫ‌లితాల నిచ్చాయి. ప్ర‌తిప‌క్షాలు చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌లం అయ్యాయి.

దుర్ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే…

అంత‌ర్వేది ఘ‌ట‌న‌లోనే కాదు.. ఎక్క‌డ నేరాలు, ఘోరాలు జ‌రిగినా సీఎం జ‌గ‌న్ వెంట‌నే స్పందించే వారు. బాధ్యుల‌పై చ‌ర్య‌ల‌కు త‌గిన ఆదేశాలు జారీ చేసేవారు. తూర్పుగోదావరి జిల్లాలో సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో దళిత యువకుడి ఘటనను ఆస‌రాగా చేసుకుని టీడీపీ ద‌ళితుల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేసిన విష‌యం తెలిసిందే. ఎటువంటి ఆందోళ‌న‌లు పెర‌గ‌కుండా బాధ్యులైన సిబ్బందిపై తక్షణ చర్యలకు సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. సీతానగరం పోలీస్ స్టేషన్ ఇంచార్జి ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. తాజాగా అమరావతి రైతులకు బేడీలు వేసిన ఘటనపై కూడా సీఎం జ‌గ‌న్ గుంటూరు ఎస్పీ విశాల్ గున్నీతో మాట్లాడి కారణమైన పోలీసు అధికారులపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. రైతులను తీసుకెళ్లిన ఆరుగురు ఎస్కార్ట్‌ హెడ్‌ కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. ఆర్‌ఎస్‌ఐ, ఆర్‌ఐలకు ఎస్పీ విశాల్‌ గున్నీ ఛార్జి మెమోలు జారీ చేశారు.

గాజువాక ఘ‌ట‌న‌పై కూడా..

గాజువాకలో యువ‌తిపై ప్రేమోన్మాది ఘటనపై కూడా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌గా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీ, సీఎస్‌ని ఆదేశించారు. బాధితురాలు వరలక్ష్మి కుటుంబసభ్యులకు 10లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మహిళల భద్రత పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని డీజీపీ, సీఎస్‌లను సీఎం జగన్‌ ఆదేశించారు. విద్యార్థినులందరూ దిశా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేవిధంగా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. ఘటన తెలిసిన వెంటనే ఆదివారం ఉదయం సీఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్‌ చీఫ్‌ నుంచి సీఎం జగన్‌ వివరాలను తెలుసుకున్నారు. వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించాలని హోం మంత్రి మేకతోటి సుచరిత, దిశ ప్రత్యేక అధికారులు కృతికాశుక్లా, దీపికా పాటిల్‌ను ఆదేశించారు. .. ఇలా ఒక‌టి, రెండు కాదు.. రాష్ట్రంలో ఎక్క‌డ‌, ఎలాంటి దుర్ఘ‌ట‌న‌లు జ‌రిగినా సీఎం జ‌గ‌న్ చాలా వేగంగా స్పందిస్తున్నారు. వాటి కార‌ణంగా మ‌రిన్ని ఉప‌ద్ర‌వాలు జ‌ర‌గ‌కుండా అరిక‌డుతున్నారు. ఇవ‌న్నీ ఏపీలో నేరాల రేటు త‌గ్గ‌డానికి దోహ‌ద‌ప‌డుతున్నాయి.

శోకాలు పెట్టిన వారంతా ఏమయ్యారో?

క్రైం రికార్డు బ్యూరో తాజాగా వెల్లడించిన రిపోర్టులో టీడీపీ హయాంలో కంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనలో 18శాతం నేరాలు తగ్గిన విషయాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. ‘వైఎస్సార్ కాంగ్రెస్ గెలిస్తే అరాచకమే అంటూ శోకాలు పెట్టిన వారంతా ఏమయ్యారో? బాబు హయాంలో కంటే 18% నేరాలు తగ్గినట్టు క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. కుల, మత ఘర్షణలు, రెచ్చగొట్టే కుట్రలు జరిగినా ప్రజలు పట్టించుకోలేదు. యువ సీఎం పాలనకు ఇంతకంటే ప్రశంసలు ఏం కావాలి’ అని విజయసాయి రెడ్డి ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి