iDreamPost

అమ్మా క్షమించు.. నేను చనిపోతే వచ్చే రూ.10 లక్షలతో..

అమ్మా క్షమించు.. నేను చనిపోతే వచ్చే రూ.10 లక్షలతో..

’అప్పు ఇచ్చువాడు వైద్యుడు‘ సామెత ఏమో కానీ.. రుణం తీసుకునే వారిని మాత్రం చావకొడుతున్నాయి ఫైనాన్స్ సంస్థలు. పదిసార్లు ఫోన్లు చేసి లోన్ కావాలంటూ వేధించడం దగ్గర నుండి.. తిరిగి చెల్లించకపోతే.. వారి పరువు బజారున పడేస్తున్నాయి. అనారోగ్య సమస్యలున్నాయని, ఆర్థిక ఇబ్బందులున్నాయని చెబితే పట్టించుకోరు ఆ సంస్థ ఏజెంట్లు. నెల వాయిదా వచ్చేసరికి డబ్బులు చెల్లించాల్సిందే.. లేదంటే ముక్కు పిండి వసూలు చేస్తారు. కట్టలేమని చెబితే ఇంట్లో విలువైన వస్తువులు తీసుకెళ్లిపోవడం, అందరి ముందు తిట్టిపోయడం, అవసరమైతే దాడి చేయడం వంటివి చేస్తున్నారు. దీంతో తమ పరువంతా పోయిందని కొంత మంది అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఫైనాన్షియల్ సంస్థ వేధింపులు తట్టుకోలేక అనేక మంది చనిపోయారు. తాజాగా ఈ వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం పెదగంట్యాడకు చెందిన పీత గౌరీశ్వర్ కుమార్ అలియాస్ వవన్ కుమార్ తన తల్లితో కలిసి ఉంటున్నాడు. వ్యాపారం నిమిత్తం ఓ ఫైనాన్స్ సంస్థ నుండి రూ. 10 లక్షలు రుణం తీసుకున్నాడు. ప్రతి నెల వాయిదాలు చెల్లిస్తున్నాడు. అయితే ఈ నెల వాయిదా కట్టకపోవడంతో.. ఆ సంస్థకు చెందిన ఏజెంట్ అతడితో డబ్బులు చెల్లించాలంటూ దుర్భాషలాడాడు. అయితే విధిగా కడుతున్న తన పట్ల ఆ ఏజెంట్ దురుసుగా మాట్లాడటం జీర్ణించుకోలేకపోయాడు పవన్. తన స్నేహితుడు ప్రశాంత్‌తో కలిసి శనివారం ఓ లాడ్జికి వెళ్లి.. గదిని అద్దెకు తీసుకున్నాడు. పవన్‌కు ప్రశాంత్ ధైర్యం చెప్పాడు. అనంతరం పని మీద బయటకు వచ్చేశాడు ప్రశాంత్. తిరిగి లాడ్జికి వెళ్లగా.. ఎంతకు తలుపులు తీయడంతో అనుమానం వచ్చి తల్లి, లాడ్జి సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు పోలీసులకు తెలియజేశారు.

లాడ్జికి చేరుకున్న పోలీసులు తలుపులు పగుల గొట్టి చూడగా.. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. బెడ్ షీట్‌తో ఉరి వేసుకున్నాడు. కాగా, తన ఫోనులో మరణ వాంగ్మూలాన్ని రాసుకున్నాడు. ‘అమ్మా నన్ను క్షమించు. నిన్ను బాగా చూసుకుందామనుకున్నాను. అందుకే వ్యాపారం మొదలు పెట్టారు. అయితే ఏ వ్యాపారం చేసినా నష్టాలే వస్తున్నాయి. నేను చనిపోతే ఇన్స్యూరెన్స్ కింద రూ. 10 లక్షలు వస్తాయి. వాటితో అప్పుతీర్చి సంతోషంగా ఉండు’ అంటూ టైప్ చేసి ఉంచాడు. కుమారుడి మరణ వార్తతో తల్లి తల్లడిల్లిపోయింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. అతడు చనిపోవడానికి ఫైనాన్స్ సంస్థ కారణమని భావించి.. ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ న్యూపోర్టు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు బంధువులు. అయితే ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి న్యాయం చేస్తామని పోలీసులు చెప్పడంతో విరమించుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి