iDreamPost

ఇంటికి లేటుగా వచ్చిందని తల్లి మందలిస్తే.. ఇలా చేసిందేంటీ..?

ఇంటికి లేటుగా వచ్చిందని తల్లి మందలిస్తే.. ఇలా చేసిందేంటీ..?

చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు కొందరు. తమకే సమస్యలున్నాయని, తాము మాత్రమే బాధలో ఉన్నామన్న తీవ్ర ఆలోచనతో.. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా యువత. పరీక్షల్లో మార్కులు రాలేదని, ప్రేమ విఫలమైందని, తల్లిదండ్రులు మందలించారని ప్రాణాలను తీసుకుంటుంటారు. కడుపున పుట్టిన బిడ్డలపై ఎన్నో ఆశలతో బతుకుతున్న తల్లిదండ్రులకు గుండె కోత మిగులుస్తున్నారు. సమస్యలకు పరిష్కారం చావు కాదు అన్న వాస్తవాన్ని మరిచి.. అప్పటి పరిస్థితులకు తలొగ్గి.. విగత జీవులుగా మారిపోతున్నారు. తల్లి మందలించిందన్న ఒక్క కారణంతోనే.. ఆత్మహత్య చేసుకుని..పుత్రికా శోకాన్ని మిగిల్చింది అమల. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

రాముని పట్ల గ్రామానికి చెందిన కల్లెం సుజాత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో 18 ఏళ్ల అమల కొండపాక మండలం దుద్దెడలోని కళాశాలలో బీ ఫార్మసీ చదువుతోంది. గత నెల 5న ఆమె ఆసుప్రతికి వెళుతున్నానని తల్లికి చెప్పింది. అయితే ఇంటికి ఆలస్యంగా రావడంతో తల్లి గట్టిగా మందలించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అమల.. తన తల్లి పనిచేసే హోటల్ వద్దకు వెళ్లింది. అక్కడే సమీపంలో ఉన్న పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగింది. వాంతులు చేసుకోవడంతో అది చూసిన తల్లి.. వెంటనే కూతుర్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. మేనమామ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి