iDreamPost

ఈటల ఇలా.. శ్రీనివాసరావు అలా.. కరోనాపై పొంతన లేని మాటలు

ఈటల ఇలా.. శ్రీనివాసరావు అలా.. కరోనాపై పొంతన లేని మాటలు

దేశంలో కరోన కల్లోలం సృష్టిస్తోంది. కేసులు లక్షల్లో పెరిగిపోతున్నాయి. వైరస్ రోజుకో కొత్త లక్షణంతో జనాలను బెంబేలెత్తిస్తోంది. ఒంట్లో కొంచెం నలతగా అనిపించినా జనం భయపడిపోతున్నారు. కరోనా సోకిందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కరోనా టెస్టులు, ట్రీట్ మెంట్ సంగతి దేవుడెరుగు. కనీసం జాగ్రత్తలు చెప్పడంలోనూ పొంతనలేని మాటలు చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం. కరోనా వ్యాప్తి విషయంలో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివసరావు ఒకలా చెబితే.. ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఇంకోలా చెబుతున్నారు. ఇంతకీ జనం ఎవరి మాటలు నమ్మాలి?

తీవ్రంగా హెచ్చరించిన శ్రీనివాసరావు

కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యాక తరచూ ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. వీడియో మెసేజ్ లు రిలీజ్ చేయడం.. ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా పరిస్థితిని వివరిస్తున్నారు. వైరస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, డబుల్ మ్యుటేషన్లు వచ్చాయని మొన్న హెచ్చరించారు. సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉందని, చాలా త్వరగా సోకుతోందని చెప్పారు. ఇంట్లో ఒకరికి వైరస్ సోకితే… ఇంట్లో ఉన్న మిగతా వారికి గంటల్లోనే స్ప్రెడ్ అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి అవుతోందని, ఇంట్లో కూడా మాస్కులు పెట్టుకుని ఉండాలని సూచించారు. ఫంక్షన్లు, పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని, పండుగలు ఇప్పుడు కాకపోతే మళ్లీ వస్తాయని, ప్రాణాలు పోతే రావని చెప్పారు. కుటుంబ సభ్యులను కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునని, కరోనాతో తన తండ్రి చనిపోయారని చెప్పారు. వచ్చే ఆరువారాలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నిజానికి శ్రీనివాసరావు చెప్పినట్లే కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వేల మంది జనం వైరస్ బారిన పడుతున్నారు.

అనవసరంగా భయపెడుతున్నారన్న ఈటల

కరోనా విషయంలో తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ మాత్రం మరోలా మాట్లాడారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ మరీ ఎక్కువగా చెబుతున్నారని, కరోనా గురించి అంత భయపెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. వైరస్ తో కన్నా భయంతోనే ఎక్కువ మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గాలి ద్వారా కరోనా సోకుతుందన్న శ్రీనివాసరావు కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. గాలి ద్వారా వైరస్ స్ప్రెడ్ అవుతుందనేది ఇప్పటిదాకా ఎక్కడా ప్రూవ్ కాలేదని చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత లేదని స్పష్టం చేశారు.

కేసీఆర్ మాత్రం సైలెంట్

కరోనా విషయంలో ఆరోగ్య మంత్రి, హెల్త్ డైరెక్టర్ పొంతన లేని విషయాలు చెబుతుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. తెలంగాణలో కరోనా ఎంటర్ అయిన కొత్తలో తరచూ ప్రెస్ మీట్స్ పెట్టేవారు. కరోనాపై అంచనాలు వేసేవారు. వైరస్ వ్యాప్తిపై ఒక అంచనా వేసి.. ఏప్రిల్ ఆఖరు కల్లా కరోనా ఫ్రీ స్టేట్ తెలంగాణ అవుతుందని చెప్పారు. ఆ తర్వాత కేసులు పెరిగిపోవడంతో మీడియాకు దూరంగా ఉంటున్నారు. చాలా తక్కువగానే బయటికి వస్తున్నారు. కనీసం వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రజలకు పిలుపునివ్వడం లేదు. ఆయన వ్యాక్సిన్ వేసుకున్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు.

Also Read : కరోనాపై పోరు : ఏపీలో స్కూల్స్ బంద్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి