iDreamPost

కోలుకుంటున్న వారే ఎక్కువ..?

కోలుకుంటున్న వారే ఎక్కువ..?

కోవిడ్‌ మహమ్మారి దేశానిన ఒక ఊపు ఊపేసింది. అయితే నెమ్మదిగా తన ఉధృతిని తగ్గించుకుంటోంది. ఇందుకు ప్రతి రోజూ నమోదవుతున్న పాజిటివ్‌ కేసులే నిదర్శనం. కోవిడ్‌ పాజిటివ్‌లుగా నమోదవుతున్న కేసుల కంటే, దాన్నుంచి కోలుకుంటున్న వారి సంఖ్యే అధికంగా ఉంటోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం వ్యాధి భారిన పడేవారి సంఖ్య 3.66 శాతం మాత్రమే ఉందని వివరిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు 3,59,819 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయని పేర్కొంది. ప్రతి రోజూ వైరస్‌ భారిన పడేవారి సంఖ్యకంటే కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదవుతోంది. దాదాపుగా గత ఇరవై రోజుల నుంచి ఇదే రకమైన పరిస్థితి కన్పిస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా కోవిడ్‌ ఒత్తిడి నుంచి ఇప్పుడిప్పుడే కాస్తంత రిలీఫ్‌ పొందుతున్నారు.

ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కోవిడ్‌ భారిన పడిన వారి సంఖ్య 98 లక్షల మార్కును దాటేసింది. మన దేశంలో పెరుగుతున్న రికవరీలతో సానుకూలమైన వాతావరణం నెలకొనగా యూరప్‌లో అందుకు భిన్నమైన పరిస్థితిలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలో కోవిడ్‌ మరణ మృదంగం మోగిస్తోంది. ప్రతి రోజూ మూడువేల మందికిపైగా మృతి చెందుతుండడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం బాధితుల సంఖ్య 1.60 కోట్లను దాటేసింది. ఒక పక్క వ్యాక్సిన్‌లు వస్తున్నాయంటూ ఊరిస్తున్నాయి. మరో పక్క యూరప్‌లో మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆయా దేశాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

ఇప్పటి వరకు కోవిడ్‌తోనే ఇబ్బందులు పడ్డ జనం వ్యాక్సిన్‌ వచ్చేస్తుందటూ వచ్చే వార్తలు కొంచెం ఊరటనే కల్గించాయి. అయితే ధనికదేశాలు వ్యాక్సిన్‌ను ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేస్తుండడంతో పేద దేశాల పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వాస్తవానికి ఒక దేశంలో ఉన్న జనాభా మొత్తానికి వ్యాక్సిన్‌ వెయ్యాల్సిన అవసరం లేదు. అయితే అందుకు భిన్నంగా ధనిక దేశాలు తమ జనాభాకంటే కొన్ని రెట్లు అధికంగా వ్యాక్సిన్‌లను కొనుగోలు చేస్తున్నాయి. దీనిపై గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఏదో ఒక్కదేశం టీకాను మొత్తం కొనుగోలు చేసేసినంత మాత్రాన ఆ దేశ పౌరులు సేఫ్‌గా ఉన్నారనుకోవడానికి లేదన్నది స్పష్టం చేసింది.

అయినప్పటికీ ఆయా దేశాల దృక్ఫథంలో మార్పు లేకపోవడంతో ఇప్పుడు కోవిడ్‌కంటే ఎక్కువ ఆందోళన కల్గిస్తోంది. మన దేశంలో దాదాపు యాభైశాతం మందికి సరిపడా టీకాలను ఇప్పటికే కొనుగోలు చేసినట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వీటిని అవసరమైన వారికి సక్రమంగా చేరవేసేందుకు కేంద్ర, రాష్ట్ర రప్రభుత్వాలు సమన్వయంతో ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి