iDreamPost

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో సనాతన ధర్మంపై కోర్సు

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో సనాతన ధర్మంపై కోర్సు

ఉత్తర ప్రదేశ్ లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి తులనాత్మక మతం (Comparative Religion)పై కొత్తగా పీజీ కోర్సు ప్రవేశపెడుతోంది. ఈ కోర్సులో ఇస్లామిక్ స్టడీస్ తో పాటు సనాతన ధర్మం, ఇతర మత గ్రంథాలకు సంబంధించిన సిలబస్ ఉంటుంది. ఇంతవరకు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఇస్లామిక్ స్టడీస్ కి సంబంధించిన కోర్సు మాత్రమే ఉంది. ఇస్లామిక్ స్టడీస్ తో పాటు సనాతన ధర్మం, ఇతర మతాలకు సంబంధించిన ప్రామాణిక విద్యను కూడా అందించాలన్న ఉద్దేశంతోనే ఈ కోర్సు ప్రారంభిస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. కొత్త కోర్సులో వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, రామాయణం, భగవద్గీతకు సంబంధించిన పాఠ్యాంశాలుంటాయి. వీటితో పాటు బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం ఇంకా మరికొన్ని మతాలకు సంబంధించిన అంశాలు కూడా కరిక్యులమ్ లో ఉంటాయి.

ఈ ప్రకటనకు కొన్నాళ్ళ ముందే యూనివర్సిటీ ఇస్లామిక్ స్టడీస్ విభాగం రెండు పుస్తకాలను సిలబస్ నుంచి తొలగించింది. ఈ బుక్స్ ఇస్లామిక్ రాజ్యాన్ని సమర్థిస్తున్నాయన్న ఆరోపణలు రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సనాతన ధర్మంపై కొత్త కోర్సు ప్రవేశపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి