iDreamPost

వేగంగా నిర్ణయాలు.. మండలి రద్దుపై మరో అడుగు

వేగంగా నిర్ణయాలు.. మండలి రద్దుపై మరో అడుగు

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దుపై ఏపీ ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. మండలిని రద్దు చేస్తూ నిన్న సోమవారం అసెంబ్లీ తీర్మానం చేయగా దాన్ని ఈ రోజు కేంద్రానికి పంపారు. శాసన సభ కార్యదర్శి తీర్మాన ప్రతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి పంపారు. దాన్ని పరిశీలించిన ప్రధాన కార్యదర్శి పార్లమెంట్‌ సచివాలయానికి పంపారు. దీంతో ఏపీ శాసన మండలి రద్దుపై మరో అడుగు పడినట్లైంది.

మండలి రద్దుపై తనకు అందిన అసెంబ్లీ తీర్మానాన్ని పార్లమెంట్‌ సచివాలయం కేంద్ర హోంశాఖకు పంపిస్తుంది. అక్కడ అధ్యయనం తర్వాత పార్లమెంట్‌ ఆమోదానికి వస్తుంది. మొదట లోక్‌ సభలో తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభకు పంపిస్తారు. రాజ్యసభ ఆమోదం తర్వాత రాష్ట్రపతి వద్దకు తీర్మానం చేరుతుంది. దానిపై రాష్ట్ర పతి సంతకం చేసి గెజిట్‌ విడుదల చేయడంతో మండలి రద్దు ప్రక్రియ పూర్తవుతుంది. దీనికి మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

కాగా, నిన్న సోమవారం జరిగిన ఏపీ శాసన సభలో మండలి రద్దుకు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. 133 ఓట్లు రద్దుకు అనుకూలంగా వచ్చాయి. ప్రతిపక్ష టీడీపీ సభకు రాకపోవడంతో వ్యతిరేక ఓట్లు లేవు. జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ కూడా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలపడంతో తటస్థ ఓట్లు కూడా నమోదు కాలేదు. అయితే సభకు ప్రతిపక్షం రాకపోయినా మండలి మంటలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మీడియాలో టీడీపీ నేతలు మండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ తీరును తూర్పారపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి