iDreamPost

పరస్పర అవినీతి ఆరోపణలు.. ‘తూర్పు’లో సత్యప్రమాణం చేసిన ప్రజా ప్రతినిధులు

పరస్పర అవినీతి ఆరోపణలు.. ‘తూర్పు’లో సత్యప్రమాణం చేసిన ప్రజా ప్రతినిధులు

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజవర్గం రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. తాజా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య మొదలైన అవినీతి ఆరోపణలు, విమర్శలు.. చివరకు సత్యప్రమాణానికి దారితీశాయి. తీవ్ర ఉద్రిక్తలు, ఉత్కంఠ నడుమ సాగిన ఈ వ్యవహారం అందిరిలోనూ ఆసక్తిని రేపుతోంది.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్‌సత్తి సూర్యనారాయణ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి అవినీతి ఆరోపణలు చేశారు. భూముల సేకరణ, మైనింగ్‌ వ్యవహారాల్లో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ముడుపులు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఆ అవసరం తనకు లేదని డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. నల్లమిల్లి రామకృష్ణా రెడ్డే.. టీడీపీ ప్రభుత్వ హాయంలో నీరు చెట్టు, మట్టి, ధాన్యం కోనుగోళ్లలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆరోపించారు. అవినీతికి పాల్పడలేదని తాను బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో ప్రమాణం చేస్తానని, అదే విధంగా రామకృష్ణా రెడ్డి కూడా ప్రమాణం చేయాలని సత్తి సూర్యనారాయణ రెడ్డి సవాల్‌ విసిరారు. దంపతులు ఇద్దరూ వచ్చి ప్రమాణం చేయాలన్నారు. ఈ రోజు బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు సమయాన్ని ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి నిర్ణయించారు.

అయితే ప్రమాణం చేసే ముందు అవినీతిపై చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి డిమాండ్‌ చేశారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారంతో అనపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. చర్చకు అనుమతించని పోలీసులు.. సత్యప్రమాణానికి మాత్రం అనుమతిచ్చారు. అయితే భారీ స్థాయిలో అనుచరులను అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఇరువురి వెంట ముగ్గురు మాత్రమే వెళ్లేందుకు అనుమతించారు.

సత్య ప్రమాణం చేసే సమయంలో దేవాలయం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలను, మీడియా ప్రతినిధులను దేవాలయంలోకి అనుమతించలేదు. కేవలం పోలీసులు, ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దంపతులతోపాటు వారి అనుచరులు ముగ్గురి చొప్పున మాత్రమే లోపలికి అనుమతించారు. ఎమ్మెల్యే దంపతులు ప్రమాణం చేయగా.. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి తాను ఒక్కడే ప్రమాణం చేశారు. అయితే మీడియాను అనుమతించకపోవంతో ఎవరు..? ఏమని..? ప్రమాణం చేశారన్నది మిస్టరీగా మారింది. మొత్తం మీద ఈ సత్య ప్రమాణం రాజకీయంలో భార్యతో కలసి ప్రమాణం చేసిన ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి పై చేయి సాధించినట్లైంది. భార్యతో వెళ్లినా తాను ఒక్కడే ప్రమాణం చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి.. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలుకు బలం చేకూర్చారని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి