iDreamPost

నవ్విన నాపచేనే పండుతోంది

నవ్విన నాపచేనే పండుతోంది

నవ్విన నాపచేనే పండుతుంది అంటారు. అది అక్షర సత్యమని బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు విషయంలో మరోమారు రుజువైంది. వివిధ కులాల ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి వైసీపీ సర్కార్‌ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గతంలో బీసీ కార్పొరేషన్‌ మాత్రమే ఉండగా.. ఇప్పుడు బీసీలలోని 139 ఉపకులాల వారికి సరైన ప్రాతినిధ్యం దక్కేలా, ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా 56 కార్పొరేషన్ల జగన్‌ సర్కార్‌ గత ఏడాది నవంబర్‌లో ఏర్పాటు చేసింది. వాటికి పాలక మండళ్లను నియమించింది. ఒక్కొక్క కార్పొరేషన్‌కు చైర్మన్‌/చైర్‌పర్సన్‌తో సహా 12 డైరెక్టర్లను నియమించింది. వారికి జీత భత్యాలు ఇస్తోంది.

తాజాగా ఆయా కార్పొరేషన్ల చైర్మన్‌/చైర్‌పర్సన్లకు జిల్లా పరిషత్‌ పాలక మండలిలో అక్స్‌అఫిషియో సభ్యులుగా నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయం ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉంది. ఇందుకు అవసరమైన చట్ట సవరణ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. చైర్మన్, చైర్‌పర్సన్లు కోరిన జిల్లాల్లో సభ్యత్వం తీసుకోవచ్చు.

జిల్లా పరిషత్‌లో జడ్పీటీసీలు సభ్యులుగా ఉంటారు. వారిలో ఒకరిని చైర్మన్‌గా మరొకరిని వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఆ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉంటారు. వీరికి ఓటు హక్కు ఉండదు. వీరి మాదిరిగానే కార్పొరేషన్‌ చైర్మన్‌/చైర్‌పర్సన్లకు సభ్యత్వం ఇచ్చే యోచనలో జగన్‌ సర్కార్‌ ఉంది. ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా కార్పొరేషన్ల చైర్మన్లు, ౖచెర్‌ పర్సన్లు సమావేశాలకు హాజరకావచ్చు. ప్రజల సమస్యలను ప్రస్తావించవచ్చు. ఎమ్మెల్యేలు, ఎంపీల మాదిరిగా వీరికి కూడా ఓటు హక్కు ఉండదు. జిల్లా పరిషత్‌లో సభ్యత్వంతోపాటు.. జిల్లా పరిషత్‌ స్టాండింగ్‌ కమిటీల్లోనూ సభ్యులుగా వీరిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఫలితంగా తక్కువ జనాబా ఉన్న కులాల వారి సమస్యలు కూడా వెలుగులోకి వస్తాయి. ఆయా సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

కార్పొరేషన్ల చైర్మన్లు, చైర్‌పర్సన్లను, డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం తక్కువ సమయంలోనే వారికి అనేక బాధ్యతలు అప్పగిస్తూ గౌరవాన్ని కల్పిస్తోంది. గత ఏడాది నవంబర్‌లో బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లను ఏర్పాటు చేసిన సమయంలో ప్రతిపక్ష టీడీపీ హేళన చేసింది. ప్రభుత్వం వారికి కనీసం కుర్చి అయినా వేస్తుందా..? అని ఎగతాళి చేసింది. కార్పొరేషన్ల ఏర్పాటును తక్కువ చేసి మాట్లాడిన వారి చెంప చళ్లుమనిపించేలా.. జగన్‌ సర్కార్‌వారికి జీతభత్యాలు కూడా ఇచ్చింది. చైర్మన్‌/చైర్‌పర్సన్లకు జీత భత్యాలుగా ప్రతి నెల 2,56,500 రూపాయలు చెల్లిస్తోంది. ఇందులో చైర్మన్, చైర్‌పర్సన్ల జీతం 65 వేల రూపాయలు. మిగతా మొత్తం ఇంటి అద్దె, సిబ్బంది జీతాలు, ఇతర అలవెన్సులు ఉన్నాయి. డైరెక్టర్లకు 14 వేల రూపాయలు జీతం ఇస్తున్నారు. గత ఏడాది నవంబర్‌ నుంచే 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లకు జీత భత్యాలు అందుతున్నాయి. చైర్మన్, చైర్‌పర్సన్లకు జిల్లా పరిషత్‌లోనూ సభ్యత్వం ఇవ్వాలనే వైసీపీ ప్రభుత్వ ఆలోచనపై టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి