iDreamPost

దేశమంతటా కరోనా కల్లోలం, కేంద్రం స్పందన కోసం ఎదురుచూపులు

దేశమంతటా కరోనా కల్లోలం, కేంద్రం స్పందన కోసం ఎదురుచూపులు

దేశం మరోసారి కరోనా కోరల్లో చిక్కుకుంది. గతం కన్నా ఉధృతంగా ఈసారి కరోనా తీవ్రత కనిపిస్తోంది. కేసుల సంఖ్య దానికి తార్కాణంగా చెప్పవచ్చు. అధికారిక సమాచారం ప్రకారమే గురువారం ఒక్కరోజులోనే 2లక్షల పైబడిన కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య కూడా అత్యధికంగా సుమారు 11వందలకు చేరింది.

ఉత్తరాది రాష్ట్రాల్లో ఊపిరిసలపని స్థితి ఏర్పడుతోంది. గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, తాజాగా యూపీలో కూడా కల్లోలం కనిపిస్తోంది. ‌ గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాలోల మార్చురీలు నిండిపోయాయి. చివరకు అత్యవసరంగా ఎలక్ట్రికల్ దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది. గుజరాత్ లో అంబులెన్స్ కావాలంటే 15గంటలు వేచి చూడాల్సి వస్తోందని మీడియాలో వచ్చిన కథనాలు ప్రమాదస్థాయిని చాటుతున్నాయి. మధ్యప్రదేశ్ లో మరొకరికి ఆక్సిజన్ అందించడం కోసం చావుబతుకుల్లో ఉన్న వారి నుంచి ఆక్సిజన్ పైప్ తొలగించిన దృశ్యాలు కలచివేసే స్థాయిలో ఉన్నాయి.

గడిచిన వారం రోజుల్లోనే పంజాబ్‌లో 9.27%, మహారాష్ట్రలో 19.39% కేసులు పెరిగాయి. అదే సమయంలో యూపీలో 250%, దిల్లీలో 166%, రాజస్థాన్‌లో 164%, ఉత్తరాఖండ్‌లో 143%, పశ్చిమబెంగాల్‌లో 127%, కేరళలో 105%, ఛత్తీస్‌గడ్‌లో 105%, మధ్యప్రదేశ్‌లో 95%, గుజరాత్‌లో 80%, హరియాణాలో 77%, తమిళనాడులో 74%, కర్ణాటకలో 69% కేసులు అధికారిక లెక్కల్లో పెరిగిన తీరు విస్మయకరంగా మారుతోంది. అయితే గుజరాత్ లో ప్రభుత్వం చెప్పే లెక్కలకు, స్మశానాల వద్దకు వస్తున్న వాహనాలతో పోలిస్తే పొంతనలేదని తెలుస్తోంది. దాంతో అమాంతంగా కోవిడ్ కేసులు పెరగడం అలజడి రేపుతోంది. వైద్య సదుపాయాలు అందబాటులో లేక ప్రాణాలు కోల్పోతున్న వారి ధైన్యం దేశమంతా కలవరపరుస్తోంది.

Also Read : తెలంగాణాలో మరో ఎన్నికకు మోగిన నగారా

ఈ పరిస్థితులకు తోడుగా తాజాగా కుంభమేళా కారణంగా కేసులు పెరగవచ్చనే ఆందోళన మొదలయ్యింది. ఇప్పటికే యాక్టివ్ కేసులు 14లక్షల దాటిపోయాయి. వెంటిలేటర్లు, ఆక్సిజన్ కొరత సర్వత్రా ఉంది. దానికి తోడు పరీక్షలు చేయడానికి కూడా సరిపడా ఏర్పాట్లు లేవు. ఇక వ్యాక్సిన్ కొరత కూడా పూర్తిగా తీరలేదు. ఇలాంటి సమయంలో వసల కూలీలు మళ్లీ రివర్స్ మైగ్రేషన్ ప్రారంభించారు. ఆస్పత్రిలో బెడ్ కోసం అనేక మంది ఆపసోపాలు పడాల్సి వస్తోంది. గతం కన్నా తీవ్రంగా పరిస్థితి తల్లడడిల్లిపోయే స్థితికి వచ్చింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం జోక్యం చేసుకుని దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని మహారాష్ట్ర సీఎం ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం ఉదారంగా సాయం చేయాలని ఆశిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకు సానుకూల స్పందన కనిపించడం లేదని చత్తీస్ ఘడ్ ప్రభుత్వం వాపోతోంది.

మహారాష్ట్రలో ఇప్పటికే లాక్‌డౌన్‌ తరహా జనతా కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. మధ్యప్రదేశ్ కూడా మే 1వరకూ కఠిన ఆంక్షలు ప్రకటించింది. ఏమయినా గత ఏడాది ఇదే రోజుల కన్నా తీవ్రంగా కరోనా విరుచుకుపడుతున్న సమయంలో కేంద్రం చొరవ చూపకపోతే పలు ఉత్తరాది రాష్ట్రాల్లో దయనీయ పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : పాకిస్తాన్ లో అంత‌ర్యుద్ధం..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి