iDreamPost

వైరస్ కట్టడికి మినీ లాక్ డౌన్లు

వైరస్ కట్టడికి మినీ లాక్ డౌన్లు

కోవిడ్ కరాళ నృత్యం చేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధిస్తోంది. గత ఏడాది మాదిరిగా దేశవ్యాప్త సంపూర్ణ లాక్ డౌన్ విధించేందుకు విముఖంగా ఉన్నట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన కేంద్రం .. అదే స్థాయి కఠిన ఆంక్షలతో ఎక్కడికక్కడ కేసులు తీవ్రతను బట్టి మినీ లాక్ డౌన్ విధించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల వ్యవధిలో పది శాతానికి మించి పాజిటివ్ కేసులు నమోదైన లేదా ఆక్సిజన్, ఐసీయు పడకల ఆక్యుపెన్సీ 60 శాతం దాటిన ప్రాంతాల్లో మినీ లాక్ డౌన్ ప్రకటించి.. ఆంక్షలు అమల్లోకి తేవాలని సూచిస్తూ రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజా మార్గదర్శకాలు పంపింది.

దాదాపు లాక్ డౌన్ పరిస్థితే..

కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్శకాలు అమలుచేస్తే కరోనా కేసులు పెరిగిన ప్రాంతాల్లో గత ఏడాది అమలు చేసిన లాక్ డౌన్ పరిస్థితే దాదాపు ఏర్పడుతుంది. నిర్థేశిత ప్రాంతంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు మినీ లాక్‌డౌన్‌ ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వారం రోజుల వ్యవధిలో కేసులు 10 శాతం దాటితే సదరు పట్టణం, నగరంలో లాక్‌డౌన్‌ విధిస్తారు. ఉదహారణకు ఒంగోలు నగరంలో ఈ రోజు 26వ తేదీన 50 పాజిటివ్‌ కేసులు నమోదైతే.. వారం రోజులుగా ఆ సంఖ్య పెరుగుతూ మే 2వ తేదీ నాటికి 55 కేసులు దాటాయంటే ఆ నగరంలో లాక్‌డౌన్‌ ప్రకటిస్తారు. అక్కడ లాక్‌డౌన్‌ మాధిరిగానే ఆంక్షలు విధించి అమలు చేస్తారు. 14 రోజులపాటు కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయి.

Also Read : నష్టం జరిగాక చర్యలు.. ఆలస్యమైంది ప్రధాని గారు..!

ఇవీ మార్గదర్శకాలు..

– నగరాలు, పట్టణాలు, జిల్లాలు, సెమీ అర్బన్ ప్రాంతాలు, పంచాయతీలు, వార్డులవారీగా ప్రాంతాలను వర్గీకరించి కేసుల పెరుగుదల, ఆస్పత్రుల్లో బెడ్స్ ఆక్యుపెన్సీ ఆధారంగా ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాలి. ఈ ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ విధించి.. మిగిలిన సమయాల్లో అత్యవసర రంగాలు తప్ప అన్నింటినీ పూర్తిగా నిషేధించాలి.

– సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, సాంస్కృతిక, మాట, ఉత్సవ సంబంధిత కార్యక్రమాలన్నింటినీ నిషేధించాలి.

– షాపింగ్ కంప్లెక్సులు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, బార్లు, క్రీడా సముదాయాలు, జిమ్ లు, స్పా సెంటర్లు, స్విమింగ్ పూల్స్, మతపరమైన స్థలాలు మూసివేస్తారు.
వివాహ కార్యక్రమాలకు 50 మందిని, అంత్యక్రియలు, కర్మకాండలకు 20 మందిని మించి అనుమతించరు.

– రైళ్లు, మెట్రో సర్వీసులు, బస్సులు, క్యాబ్ సర్వీసులో 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఉంటుంది.

– ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందితోనే రొటేషన్ పద్ధతిలో పని చేయించుకోవాలి. పని ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలి. ఉద్యోగులకు తరచు రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేయించాలి.

– ఏదైనా ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించే ముందు ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి. నిత్యవససరాలు సమకూర్చుకునేందుకు తగిన సమయం ఇవ్వాలి.

– చికిత్సకు సంబంధించి ప్రోటోకాల్ పరిధిలో ఉన్నవారికే హోమ్ ఐసోలేషన్ కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. వైరస్ లక్షణాలు ఉన్నవారు స్వయంగా వెల్లడించే పరీక్షకు, చికిత్సకు ముందుకు వచ్చేలా అవగాహన కల్పించాలి. ఆస్పత్రుల్లో పడకలు, ఖాళీల వివరాలను ఆన్ లైన్ లో ఉంచాలి. అందరికీ టీకాలు అందేవిధంగా అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

– వైద్య, పోలీస్, ఫైర్, బ్యాంకులు, విద్యుత్, నీరు, పారిశుద్ధ్య రంగాలకు ఆంక్షల నుంచి మినహాయించారు. ఇక రాష్ట్రాల్లో అంతర్గత రాకపోకలు, అంతర్రాష్ట్ర రాకపోకలు, సరుకు రవాణాకు ఎటువంటి అడ్డంకులు ఉండవని కేంద్ర మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.

Also Read : కరోనా సునామీ : మరో రాష్ట్రంలో లాక్‌డౌన్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి