iDreamPost

కరోనా వల్ల మననుషులతో పాటు మానవత్వం కూడా చచ్చిపోతుంది…

కరోనా వల్ల మననుషులతో పాటు మానవత్వం కూడా చచ్చిపోతుంది…

ఒక వ్యక్తి కూరగాయల కోసం రైతుబజార్ కి వెళ్ళాడు.. ఈలోపు ఛాతీలో నొప్పి రావడంతో మార్కెట్లోనే కుప్పకూలిపోయాడు. ఒక 15 నిమిషాలు పాటు నొప్పితో రైతుబజార్లోనే విలవిలాడుతూ చనిపోయాడు. కరోనా వైరస్ కారణంగా చుట్టూ ఉన్న ప్రజలు చోద్యం చూస్తూ నిలుచున్నారే తప్ప దగ్గరకు వెళ్లే సాహసం చేయలేదు. కనీసం ఏ ఒక్కరు స్పందించినా అతన్ని ప్రాణాలకు ప్రమాదం తప్పేది.

కర్ణాటకలోని ఉమ్నాబాద్‌కు చెందిన చంద్రకాంత్‌ ఆటోడ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతను ప్యాసింజర్‌ ఆటో నడుపుతూ రామచంద్రాపురం మండలం బండ్లగూడ సమీపంలోకి రాగానే దగ్గుతూ స్పృహ తప్పి పడిపోయాడు.ఇది చూసిన స్థానికులు అతనికి కరోనా వచ్చిందేమోనని అనుమానించారు. అతని వల్ల తమకెక్కడ వైరస్‌ అంటుతుందేమోనన్న భయంతో రాళ్లతో దాడి చేశారు.దాడి విషయం తెలుసుకున్న రామచంద్రాపురం పోలీసులు అతన్ని పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

దాచేపల్లి వద్ద పోలీసులు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోకి అనుమతించడం లేదన్న కారణంతో చీకటి పడగానే పోలీసులపై రాళ్ళ దాడి చేశారు కొందరు ప్రజలు..

కొందరు ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు కొందరు పోలీసులు అధికారం ఉంది కదా అని దురుసుగా ప్రవర్తిస్తూ లాఠీలకు పని చెప్తూ ప్రజలపై దాడి చేస్తున్నారు.

కొన్ని గ్రామాల ప్రజలు తమ గ్రామాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా ముళ్ల కంచెలు అడ్డుగా వేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఆయా గ్రామాల్లోకి అంబులెన్స్ లు రావడం కష్టతరంగా మారింది..

కరోనా అంటువ్యాధి కావడంతో మాములు జలుబు దగ్గుతో బాధపడే వ్యక్తుల్ని చూసినా ప్రజలు వణికిపోతున్నారు. అలా కరోనా వైరస్ సోకిందన్న అనుమానం వ్యక్తులను చూసిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వకుండా, బాధితుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తూ దాడి చేయడం గమనిస్తే, ప్రజల్లో ఉన్న భయానికి, వారిలో తగ్గిపోతున్న మానవత్వానికి రుజువుగా కనబడుతుంది.

గతంలో సార్స్,ఎబోలా,నిఫా,స్వైన్ ఫ్లూ లాంటి భయంకరమైన వ్యాధులు వ్యాపించినప్పుడు కూడా ప్రజలు ఇంత భయాందోళనకు గురి కాలేదు. అంటువ్యాధి కావడంతో పాటుగా సులువుగా ఒకరినుండి మరొకరికి వ్యాప్తి చెందుతుండడంతో ప్రపంచ దేశాలన్నీ కరోనాకి భయపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 190 కు పైగా దేశాలకు వ్యాపించిన కరోనా కారణంగా ఎక్కువ దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి.

కాగా కరోనా వైరస్ కారణంగా సాటి మనిషిని అనుమనించాల్సిన సమయం వచ్చింది. సాటి మనిషి తుమ్మినా, దగ్గినా పక్కనే బాంబులు పేలినంతగా ఉలిక్కిపడుతున్నారు. మాయదారి వైరస్ కారణంగా సాధారణ జలుబు చేసిన వారి పరిస్థితి కూడా దారుణంగా మారిపోయింది.

జంతువుల నుండి మనిషిని వేరు చేసేది విచక్షణ జ్ఞానం.. కానీ సాటి మనిషి అన్న విచక్షణ లేకుండా అనుమానంతో దాడులకు తెగబడటం, సహాయం చేయకుండా చోద్యం చూడటం చూస్తుంటే మనిషిలో ఉండాల్సిన మానవత్వం చివరి దశలో ఉందని అర్థం చేసుకోవచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకుని సాటి మనిషికి సహాయం చేయవచ్చు.. అంతేకానీ వైరస్ ఉందన్న అనుమానంతో తోటి వారిపై అమానవీయంగా దాడి చేయడం మాత్రం ఖండించాల్సిన విషయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సమస్యను గుర్తించి,ఈ సమస్య పట్ల అవగాహన కల్పించి ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తగ్గించే ప్రయత్నం చేయాలి.

వైరస్ పట్ల భయం ఉండటం మంచిదే.. జాగ్రత్తలు తీసుకోవడం కూడా మంచిదే.. కానీ వైరస్ సోకిందేమో అన్న అనుమానంతో తోటి మనిషికి సాయం చేయకుండా జాప్యం చేయడం, కొట్టి చంపడానికి ప్రయత్నం చేయడం మాత్రం ఖండించాల్సిన విషయం. ఇప్పటికే పలువురు సెలెబ్రెటీలు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, క్రీడాకారులు, సినిమా నటులు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విరాళాలు ప్రకటించి తమలో ఉన్న మానవత్వాన్ని చాటుకుంటుంటే కొందరు మాత్రం అమానవీయంగా ప్రవర్తిస్తూ రోగుల పట్ల పక్షపాతం చూపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సరిపోదు.. ఖచ్చితంగా ప్రతి ఒకరిలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. అప్పటివరకూ సాటి మనిషిపై వివక్ష చూపడానికి ఏదొక కారణం కావాలి అంతే అని రుజువు చేస్తూనే ఉంటారు కొందరు…

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి