iDreamPost

అమెరికా ఇప్పుడు స్టేట‌స్ కాదు, పెయిన్‌!

అమెరికా ఇప్పుడు స్టేట‌స్ కాదు, పెయిన్‌!

“మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, నెలనెలా ల‌క్ష‌లు పంపిస్తున్నాడు” అని చెప్పుకోవ‌డం మ‌న తెలుగు ప‌ల్లెల్లో స్టేట‌స్‌.

“అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. వాడున్న స్టేట్‌లో క‌ర్ఫ్యూ పెట్టారు, ఎలా ఉన్నాడో ఏంటో” అని దిగులు ప‌డ‌టం ఇప్పుడు పెయిన్‌.

అమెరికాలో క‌రోనా విజృంభిస్తూ ఉంది. అగ్ర రాజ్యం సుల‌భంగానే కంట్రోల్ చేస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ అది నిజం కాదు. అక్క‌డ కూడా అద్భుత‌మైన వైద్య సౌక‌ర్యాలేమీ లేవ‌ని అంద‌రికీ అర్థ‌మ‌వుతూ ఉంది. మ‌న‌వాళ్లు చూస్తే ల‌క్ష‌ల్లో ఉన్నారు. అమెరికా త‌ల్లిదండ్రులు ఒక‌ప్పుడు మీ వాడెంత సంపాదిస్తున్నాడు అని అడిగే వాళ్లు. మీ వాడు సేఫే క‌దా అని ఇప్పుడు అడుగుతున్నారు.

వ‌ర్క్ ఫ్రం హోం వ‌ల్ల ఉప‌యోగం ఏమంటే ఇంత‌కు ముందు మాట్లాడ‌టానికి వీకెండ్స్‌లో త‌ప్ప టైం దొరికేది కాదు. ఇప్పుడు గంట‌లు గంట‌లు మాట్లాడుతున్నారు. ఇండియాలో వీళ్లు ఎలా ఉన్నారో అని వాళ్ల‌కీ దిగులు.

అమెరికా సంగ‌తి అటుంచితే ఇత‌ర దేశాల్లో పిల్ల‌ల్ని చ‌దువుల కోసం పంపిన వాళ్లు న‌ర‌క‌యాత‌న ప‌డుతున్నారు. అక్క‌డ వాళ్లు ఉండ‌లేని స్థితి, రావాలంటే విమానాలు లేవు. ఉండ‌టానికి డ‌బ్బుల్లేవు. ఇక్క‌డ నుంచి పంపుదామంటే ఆయా దేశాల్లో బ్యాంకులు మూసేశారు.

ఈ ఏప్రిల్‌, మే నెల‌ల్లో జ‌ర‌గాల్సిన అనేక మంది NRIల పెళ్లిళ్లు వాయిదా ప‌డ్డాయి. ఫంక్ష‌న్ హాళ్ల‌కి ఇచ్చిన అడ్వాన్స్‌లు కూడా వ‌దిలేసుకుంటున్నారు. క‌రోనా గురించి తెలియ‌క సెల‌వు మీద ఇండియాకి వ‌చ్చిన వాళ్లు టెన్ష‌న్ ప‌డుతున్నారు. వెన‌క్కి పోలేరు. అక్క‌డ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియ‌దు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి