iDreamPost

పాత్రికేయులపైనా కరోరా పంజా

పాత్రికేయులపైనా కరోరా పంజా

సమాజానికి కళ్ళు, చెవుల్లాంటి మీడియా రంగంపైన కూడా కరోనా వైరస్ పంజా విసిరింది. ఇప్పటికే చాలామంది పాత్రికేయులకు వైరస్ సోకిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా విజయవాడలో కూడా పలువురికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ముంబాయ్, చెన్నై, హైదరాబాద్ లో కొందరు మీడియా ప్రతినిధులకు ప్రధానంగా టివి రిపోర్టర్లు, కెమెరామ్యాన్ తదితరులకు వైరస్ ఎటాక్ అయ్యింది. ముంబాయ్ లో సుమారు 50 మంది, చెన్నైలో 30 మంది హైదరాబాద్ లో నలుగురికి వైరస్ సోకినట్లు నిర్ధారణయ్యింది.

వీరిలో ముంబాయ్ లో వైరస్ సోకినా దాచిపెట్టాడాన్న కారణంతో సదరు జర్నలిస్టుపై మహారాష్ట్రప్రభుత్వం కేసు కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా విజయవాడలో కూడా జర్నలిస్టులతో పాటు వారి కుటుంబాలకు ప్రెస్ క్లబ్, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టెస్టులు జరిగాయి. ఎందుకంటే మీడియా ప్రతినిధులు వృత్తిలో భాగంగా అనేక ప్రాంతాల్లో తిరుగుతుంటారు. ప్రధానంగా వైరస్ బాధితులను ఉంచి చికిత్సను అందిస్తున్న ఐసొలేషన్ వార్డుల్లో, క్వారంటైన్ కేంద్రాల్లో కూడా తిరుగుతున్నారు.

అందుకనే ముందుజాగ్రత్తగా జర్నలిస్టులతో పాటు వాళ్ళ ఫ్యామిలి సభ్యులకు కూడా టెస్టులు చేశారు. దాదాపు రెండు మూడొందల మందికి పరీక్షలు నిర్వహిస్తే ఐదుగురు జర్నలిస్టులకు అందులోను టివి రిపోర్టర్లకు వైరస్ పాజిటివ్ వచ్చిందట. వీళ్ళ అయిదుగురికి రెండోసారి కూడా టెస్టులు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. రెండోసారి కూడా వైరస్ సోకినట్లు పాజిటివ్ రిజల్టు వస్తే వాళ్ళని ఐసొలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. అప్పటి వరకూ క్వారంటైన్ సెంటర్లో ఉంచినట్లు కూడా అధికారులు చెప్పారు.

మొత్తం మీద జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండకపోతే ఇతరులతో పాటు తమ కుటుంబాలను కూడా ప్రమాదంలోకి నెట్టేసే ప్రమాదం ఉందన్న విషయాన్ని మీడియా ప్రతినిధులు గ్రహించాలి. ఎందుకంటే వృత్తిలో భాగంగా అందరి దగ్గరకు వెళ్ళిపోతుంటారు కాబట్టి వీళ్ళనుండి ఈజీగా ఇతరులకు కూడా వైరస్ సోకే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి ఎవరికి వాళ్ళుగా జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి