iDreamPost

ఏపీ అసెంబ్లీకి కరోనా తాకిడి, సమావేశాల సందర్భంగా పలు ఆంక్షలు

ఏపీ అసెంబ్లీకి కరోనా తాకిడి, సమావేశాల సందర్భంగా పలు ఆంక్షలు

కరోనా వైరస్ విశ్వమంతా విజృంభిస్తున్నట్టుగానే ఏపీ అసెంబ్లీ సమావేశాల మీద కూడా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా మార్చిలో జరగాల్సిన బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. చివరకు ఈనెల 16 నుంచి మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. కేవలం ఆయా సభల్లో సభ్యులు, ఇతర కీలక అధికారులు మినహా ఇతరులను అంగీకరించేది లేదని చెబుతున్నారు. మీడియాకు కూడా పలు ఆంక్షలు విధించారు. పూర్తి జాగ్రత్తల మధ్య సమావేశాల నిర్వహణకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మరింత అప్రమత్తం అయినట్టు కనిపిస్తోంది.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగేటప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సిబ్బందని వెంట తీసుకురావద్దని అసెంబ్లీ కార్యదర్శి ఆదేశించారు.  అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో పలు నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. భౌతికదూరం పాటించేందుకు ప్రత్యేక నిబంధనలు జారీ చేశామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అసెంబ్లీ  అనుమతి ఉంటుదని తెలిపారు. ఎమ్మెల్యే తమ కార్లకు కారు పాస్‌ కచ్చితంగా అతికించాలని పేర్కొన్నారు. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

గుర్తు తెలియనివారికి అసెంబ్లీలోకి అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. గన్‌మేన్లను అసెంబ్లీలోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈసారి సమావేశాల్లో అసెంబ్లీకి విజిటర్లను అనుమతించడం లేదన్నారు. అసెంబ్లీలోకి ఎలాంటి ఆయుధాలు తీసుకురావద్దని సభ్యులకు ఆదేశాలు జారీచేశారు. బ్యానర్లు, ప్ల కార్డ్స్, కర్రలు, స్ప్రేలు వంటివేవీ అనుమతించమని, అసెంబ్లీ ఆవరణంలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని ఆదేశాలు ఇచ్చారు. సభ్యులంతా భౌతిక దూరం పాటించాలని సూచించారు. సభ్యులు వెంట విజిటర్లను తీసుకురావొద్దని మార్గదర్శకాలు జారీచేశారు. సభ్యులు పీఎస్‌లు, పీఏలు, పీఎస్‌ఓలను వెంట తీసుకురావొద్దని ఆదేశాలు ఇచ్చారు.

మీడియా పాయింట్ లో కూడా కార్యకలాపాలు ఇప్పటికే నిలిపివేశారు. మీడియా ప్రతినిధులను కూడా లాబీల్లోకి అనుమతించబోమన్నారు. గ్యాలరీలో కూడా భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. సభలో సభ్యుల సీట్ల విషయంలో కూడా మార్పులు చేస్తున్నారు. వాటితో పాటుగా గవర్నర్ ప్రసంగం కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వినిపించబోతున్నారు. ఉభయ సభల సమావేశాలు విరమించుకుని, విడివిడిగా గవర్నర్ ప్రసంగం వినిపిస్తారు. మొత్తంగా ఈసారి అసెంబ్లీ సమావేశాలు పలు మార్పుల మధ్య జరగబోతున్నట్టు చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి