iDreamPost

ఏపీ ప్రజలు పదేళ్ల తర్వాత ఆ మాట వింటున్నారు ..!

ఏపీ ప్రజలు పదేళ్ల తర్వాత ఆ మాట వింటున్నారు ..!

ముసురు.. ఈ మాట విని పదేళ్లు దాటింది. ఎప్పుడో 2010కి ముందు ఈ మాట ఆంధ్రప్రదేశ్‌లో వినిపించింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ వినిపిస్తోంది. ఈ మధ్యలో పదేళ్లలో ముసురు కాదు కదా వరుణుడి జాడ కనిపించడమే గగనమైంది. చాలీచాలనీ వర్షాలు, కరువుతో ఆంధ్రప్రదేశ్‌ అల్లాడిపోయింది. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు రాష్ట్రంలో కరువు విలయతాండవం చేసింది. గొడ్డు, గొదకు అవసరమైన నీళ్లు కూడా దొరక్క ప్రజలు అల్లాడిపోయారు. భూగర్భజలాలు అడగంటిపోయాయి. 500 అడుగుల లోతు బోర్లు వేసినా.. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో తడి జాడ కనిపించలేదంటే అతిశయోక్తికాదు. కాడి వదలక తప్పని పరిస్థితుల్లో సీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని రైతులు, రైతు కూలీలు పొట్టుచేతపట్టుకుని కృష్ణా డెల్టాలోని గుంటూరు, కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలోని ఉభయ గోదావరి జిల్లాల్లో పొలం పనులకు, హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో భవన నిర్మాణ పనులకు వలస వెళ్లారు.

వైఎస్సార్‌ మరణం తర్వాత అడపాదడపా వర్షాలు కురిశాయి.. అయితే బాబు హాయంలో మాత్రం వరుణుడు పూర్తిగా పగబట్టాడు. చినుకు చూడకుండానే ఏడాది గడిచేది. ప్రాజెక్టులు బోసిపోయాయి. కృష్ణాలో గంగమ్మ రాక మందగించింది. నాగార్జున సాగర్‌ పరిధిలో పంట వేయడం కలగా మారింది. కృష్ణా డెల్టాను తడిపేందుకు గోదావరి నీటిని పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా వైఎస్సార్‌ హాయంలో తవ్విన పోలవరం కాలువ నుంచి తరలించాల్సిన పరిస్థితి బాబు హాయంలో నెలకొంది.

రోజులు మారాయి. ప్రభుత్వాలు, పాలకులు మారాయి. మళ్లీ వరుణుడు పిలకపోయినా పలుకుతున్నాడు. రైతున్నలు, ప్రజలు పూజలు చేయకపోయినా, కప్పలకు పెళ్లిలు చేయకపోయినా, వేపచెట్టుకు, రాగిచెట్టుకు పెళ్లి చేయకపోయినా.. వానదేవుడు సకాలంలో వస్తున్నాడు. గత ఏడాది నుంచి ఇదే తంతు. పదేళ్ల తర్వాత కృష్ణమ్మ పొంగింది. ప్రాజెక్టులు నిండాయి. పుష్కలంగా వర్షాలు. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది కూడా అదే సీను రిపీటవుతోంది. వర్షాకాలం ప్రారంభం కాగానే వరుణుడు పలకరించాడు. ప్రస్తుతం నీళ్లు కుమ్మురిస్తున్నాడు. ఫలితంగా ప్రాజెక్టులకు జలకళ వచ్చేసింది. చెరువులు నిండాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నారు. రహదారులు తెగిపోతున్నాయి.

వర్షం అలా పడి ఇలా పోవడం కాదు.. మూడు, నాలుగు రోజుల పాటు ముసురుపట్టేసింది. అప్పుడప్పుడు భారీ వర్షం.. ఆ తర్వాత మోస్తరుగా జల్లులు రోజంతా ఉంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలోనూ సాధారణం కన్నా అధికంగా వర్షం పడిందని సమాచారశాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. మొత్తం మీద రాష్ట్రంలో సాధారణం కన్నా 57 శాతం అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. గ్రామీణ ప్రజలు మళ్లీ పదేళ్ల నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో ముసురు పట్టడం వల్ల వంట చెరుకు తడసిపోయి వంట చేసుకునేందుకు ఇబ్బందులుండేవి.. ఇప్పుడు ఎల్‌పీజీ వల్ల ఆ సమస్య లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి