iDreamPost

విజయనగరం జడ్పీ రిజర్వేషన్‌పై వివాదం

విజయనగరం జడ్పీ రిజర్వేషన్‌పై వివాదం

విజయనగరం జిల్లా పరిషత్‌(జడ్పీ) చైర్మన్‌ రిజర్వేషన్‌ మార్పుపై వివాదం నెలకొంది. మొదట ఎస్సీ మహిళలకు కేటాయించిన ఈ స్థానాన్ని తిరిగి జనరల్‌గా మార్చడంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ స్థానాన్ని మొదట నిర్ణయించినట్లుగా (ఎస్సీ మహిళ)నే ఉంచాలని జిల్లాకు చెందిన కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన బి.లక్ష్మీ అనే మహిళ హైకోర్టులో వ్యాఖ్యం దాఖలు చేశారు. రిజర్వేషన్‌ సవరణ నోటిఫికేష్‌ను రద్దు చేయాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల (జనవరి) 3వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ప్రమాణ పత్రం దాఖలు చేసింది. ఎస్టీలకు 6.77 శాతం, ఎస్సీలకు 19.08, బీసీలకు 34 శాతం చొప్పున 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈలెక్కన 13 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఎస్టీ సామాజిక వర్గానికి ఒకటి, ఎస్సీలకు రెండు, బీసీలకు నాలుగు చొప్పున కేటాయించిన ప్రభుత్వం మిగతా ఆరు స్థానాలను జనరల్‌ కేటగిరిలో ఉంచింది.

రాష్ట్ర ప్రభుత్వం మొదట.. నెల్లూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎస్టీలకు, అనంతపురం ఎస్సీ, విజయనగరం ఎస్సీ మహిళ, చిత్తూరు, కృష్ణా జిల్లా పరిషత్‌లు బీసీ, విశాఖపట్నం, పశ్చిమగోదావరి బీసీ మహిళ, శ్రీకాకుళం, వైఎస్సార్‌ కడప, ప్రకాశం జిల్లా పరిషత్‌లు జనరల్, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు జిల్లా పరిషత్‌లు జనరల్‌ మహిళలకు రిజర్వ్‌ చేసింది.

మరో వారం రోజులకు అంటే జనవరి 10వ తేదీన ఎస్సీలకు కేటాయించిన విజయనగరం జిల్లా పరిషత్‌ను జనరల్‌గా మార్చింది. జనరల్‌కు కేటాయించిన శ్రీకాకుళం స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయిస్తూ రిజర్వేషన్‌ సవరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

రిజర్వేషన్లు 50 శాతం దాటడంతో ముందుగా నిర్ణయించిన మేరకు ఈ నెల 17వ తేదీన వెలువడాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వాయిదా పడింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లును సవాల్‌ చేస్తూ కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయగా అతను సుప్రింను ఆశ్రయించారు. ఫలితంగా సుప్రిం కోర్టు ఎన్నికల నిర్వహణపై స్టే విధిస్తూ వివాదాన్ని నెల రోజుల్లో పరిష్కరించాలని రాష్ట్ర హైకోర్టును ఆదేశించింది.

ఈ మేరకు హైకోర్టు సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభించింది. మరో పదహేను రోజుల్లో ఈ వివాదం పరిష్కారమై ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందన్న నేపథ్యంలో తాజాగా విజయనగరం జెడ్పీ రిజర్వేషన్‌ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల వివాదంతోపాటు.. విజయనగరం జడ్పీ వివాదం కూడా ఒకే సమయంలో పరిష్కారమవుతుందా..? లేదా..? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి