iDreamPost

కండక్టర్‌.. కలెక్టర్‌ కాబోతున్నాడు..

కండక్టర్‌.. కలెక్టర్‌ కాబోతున్నాడు..

ఆయన పెద్ద పెద్ద ఇన్సిట్యూట్లలో కోచింగ్‌ తీసుకోలేదు. టాప్‌ స్టడీ మెటీరియల్‌లను చదవలేదు. రోజుకు 20 గంటలు పుస్తకాలతో కుస్తీ పట్టలేదు. ఒక వైపు కుటుంబాన్ని పోషించుకోవడానికి తీరక లేకుండా కండక్టర్‌ ఉద్యోగాన్ని చేస్తూనే సివిల్స్‌ పరీక్షలకు సిద్ధమయ్యాడు. మెయిన్స్‌ కూడా అధిగమించి ఐఏఎస్‌ కావాలనే తన ఆశయం నెరవేర్చుకునే దిశలో ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నాడు. పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చనే నానుడికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలవబోతున్నాడు ఓ యువకుడు.

కర్ణాటక రాష్ట్రం, మండ్య జిల్లా మళవల్లికి చెందిన ఎన్‌సీ మధు బెంగుళూరులోని కొత్తనూరు బీఎంటీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. తన 19వ ఏటనే ఉద్యోగం సాధించాడు. అయితే తనకు చదువు అంటే ఎంతో ఇష్టం. ఐఏఎస్‌ కావాలని కలలు కన్నాడు. అందుకోసం ఒక్కో మెట్టూ ఎక్కడం మొదలు పెట్టాడు. మొదట దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీని పూర్తి చేశాడు. 2014లో కర్ణాటక పబ్లిక్‌ సర్వీస్, 2018లో సివిల్స్‌ రాశాడు. అయితే ఆ పరీక్షల్లో అతనికి నిరాశ ఎదురయ్యింది. అంతటితో కుంగిపోకుండా సివిల్స్‌ పరీక్షల మెళకువలు నేర్చుకున్నాడు. మరింత పట్టుదలతో చదవడం మొదలుపెట్టాడు. ఎక్కడా కోచింగ్‌కు వెళ్లకుండా రోజూ కండక్టర్‌ డ్యూటీ అనంతరం ఐదు గంటల పాటు యూట్యూబ్‌ వీడియోలను క్షుణ్నంగా ఫాలో అవుతూ 2019లో కన్నడ మాధ్యమంలో సివిల్స్‌ రాసి ప్రిలిమ్స్, మెయిన్స్‌లలో ఉత్తీర్ణత సాధించాడు. మార్చి 25న ఢిల్లీలో జరిగే ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నాడు. అందులో అతను ఉత్తీర్ణత సాధిస్తే కలెక్టర్‌ కావాలనే తన కలను నెరవేర్చుకుంటాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి