iDreamPost

కన్నుల పండువలా బీసీల సంక్రాంతి సభ .. బాధ్యతను గుర్తు చేసిన సీఎం జగన్‌

కన్నుల పండువలా బీసీల సంక్రాంతి సభ .. బాధ్యతను గుర్తు చేసిన సీఎం జగన్‌

విజయవాడలోని ఇందిర గాంధీ మున్సిపల్‌ స్టేడియం దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి సాక్షిగా నిలిచింది. బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్ల సభ్యులు ఈ రోజు పదవీ బాధ్యలు స్వీకరించారు. బీసీల సంక్రాంతి పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 56 కార్పొరేషన్ల చైర్మన్‌/చైర్‌పర్సన్లు, 672 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కన్నుల పండువగా సాగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హాజరయ్యారు.

జోతిరావ్‌ పూలే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిల చిత్రపటాలకు నివాళులర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌.. అనంతరం బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు ఉద్దేశం, పాలక మండళ్ల బాధ్యతను గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఉన్నతి స్థితికి తీసుకెళ్లేందుకు పని చేస్తున్నామన్నారు. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదని, మన సంస్కృతికి వెన్నుముక అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. గత ప్రభుత్వం వెనుకబడిన వారి వెన్నుముక విరిచిన పరిస్థితిని చూశామని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా చట్టసభల్లోనూ, ప్రభుత్వంలోనూ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. మహిళా అభ్యుదయంలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టేలా బీసీ కార్పొరేషన్లలో 50 శాతం కన్నా పైగా పదవుల్లో మహిళలను నియమించామని సీఎం గుర్తు చేశారు. సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చిందని వ్యాఖ్యానించారు.

బీసీ సామాజికవర్గ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించేలా పాలక మండళ్లు పని చేయాలని సీఎం జగన్‌ సూచించారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించే బాధ్యతను పాలకమండళ్లు స్వీకరించాలని కోరారు. కార్పొరేషన్ల పనితీరులో సమూల మార్పులు రావాలని ఆభిలషించారు. 18 నెలల క్రితం ఇదే వేదికపై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.. 18 నెలల పాలనలో ప్రజల సంక్షేమం కోసం తన ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఆయా పథకాల ద్వారా ఎంత మేర ప్రజలకు లబ్ధి చేకూరింది గణాంక సహితంగా వివరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి