iDreamPost

రాజస్థాన్‌లో సిఎం వర్సెస్ డిప్యూటీ సిఎం-సచిన్ పైలెట్ పై అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు

రాజస్థాన్‌లో సిఎం వర్సెస్ డిప్యూటీ సిఎం-సచిన్ పైలెట్ పై అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు

రాజస్థాన్‌లో మళ్లీ వారి ఇద్దరి మధ్య వార్ మొదలైంది. అయితే ఈసారి ప్రత్యక్షంగా కాదు. పరోక్షంగా పిసిస అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్ రెండోతరం నేతలు, యువ నేతలపై కూడా గెహ్లాట్ విరుచుకుపడ్డారు.

యువనేతలు ఏమాత్రం కార్యక్షేత్రంలో పనిచేయడం లేదని, అయినా సరే.. కాంగ్రెస్ హై కమాండ్ వారిని కేంద్ర మంత్రులు, పిసిసి అధ్యక్షులను చేసేస్తోందని విమర్శలు చేశారు. అయితే ఎవరి పేరెత్తకుండానే అన్యాపదేశంగా సచిన్ పైలెట్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని అందరూ భావిస్తున్నారు.

‘‘మేము రాజకీయాల్లోకి ప్రవేశించిన సమయంలో రిజర్వేషన్లు లేకుండానే రైళ్లలో ప్రయాణం చేసేవాళ్లం. కిందనే పడుకునేవారం. తరచూ గ్రామాల్లో పర్యటించేవాళ్లం. సైకిళ్లపై తిరిగేవాళ్లం. అయితే ఇప్పటి తరం నేతలు మాత్రం ఇలాంటి కష్టాలు లేకుండానే అమాంతం పైకి ఎదిగిపోతున్నారు. వాళ్ల తప్పేం కాదు. కానీ కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే వారికి మంచి అవకాశాలు వస్తున్నాయి’’ అని అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే… సచిన్ పైలెట్‌పై అన్యాపదేశంగా విరుచుకుపడ్డా…ఆయనతో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలూ లేవని గెహ్లాట్ స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి, కలిసి పనిచేస్తున్నామని, ప్రతిపక్ష బిజెపి తమ మధ్య పొరపొచ్చాలు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

గతంలో కూడా సచిన్ పైలెట్‌కు, సిఎం గెహ్లాట్ మధ్య తీవ్ర విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా, వైఫల్యాలను గత ప్రభుత్వంపై నెట్టేయడం ఏమాత్రం భావ్యం కాదని గతంలో కూడా సిఎం గెహ్లాట్‌ను పైలెట్ ఇరకాటంలోకి నెట్టేశారు.

ఇలా… ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలకు దిగి చివరికి పంచాయితీ సోనియా గాంధీ  వద్దకు చేరింది. కొన్నాళ్ల పాటూ సర్దుకున్నట్లు ఉన్నా, మళ్లీ ఇద్దరి మధ్య వార్ మొదలైంది. 

అయితే గత ఎన్నికల్లో అందరూ ఊహించినట్లే కాంగ్రెస్ గెలిచింది. బిజెపి ఓటమి చెందింది. అయితే గెచిన తరువాత ముఖ్యమంత్రి పీఠం పై సీనియర్ అయినా అశోక్ గెహ్లాట్ కు, యువనేత అయిన సచిన్ పైలెట్ కు మధ్య వార్ నడిచింది. అయితే అప్పుడు సమీపంలో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో సాధారణంగా ఎవరైనా సీనియర్లకే ప్రాధాన్యత ఇస్తారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా సీనియర్ అయినా అశోకగ గెహ్లాట్ కే ప్రాధాన్యం ఇచ్చింది. అయితే పిసిసి పదవి, హోం మంత్రిత్వ శాఖతో కూడిన డిప్యూటీ సిఎం పదవి ఇచ్చి సచిన్ పైలెట్ ను కాంగ్రెస్ అధిష్టానం సోనియా, రాహుల్ గాంధీలు బుజ్జగించారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య అంతర్గత వార్ జరుగుతునే ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి