iDreamPost

ఆ విషయంలో మా ప్రభుత్వం దేశానికే ఆదర్శం: ముఖ్యమంత్రి KCR

  • Author singhj Published - 09:00 PM, Fri - 1 September 23
  • Author singhj Published - 09:00 PM, Fri - 1 September 23
ఆ విషయంలో మా ప్రభుత్వం దేశానికే ఆదర్శం: ముఖ్యమంత్రి KCR

తెలంగాణ ప్రభుత్వం చాలా విషయాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సంక్షేమానికి అగ్ర తాంబూలం ఇవ్వడంలో తాము అందరికంటే ముందున్నామని చెప్పారు. దీని వెనుక జాతిపిత మహాత్మా గాంధీ ప్రభావం ఉందని కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్​లోని హెచ్​ఐసీసీలో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య​అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య పోరాటం, అందులో గాంధీజీ పాత్ర, తెలంగాణ ఉద్యమం, సంక్షేమం తదితర అంశాల గురించి కేసీఆర్ మాట్లాడారు. సమాచార శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘గాంధీ’ సినిమాను చూసి 35 లక్షల మంది స్టూడెంట్స్, ఇతరులు ప్రభావితం అయ్యారని తెలిపారు.

‘గాంధీ’ మూవీని ఈతరం వారికి పరిచయం చేయడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధుల గొప్పతనం నేటి తరానికి సమగ్రంగా తెలియాల్సిన అవసరం ఉందన్నారాయన. కొన్ని వేల ఏళ్ల కిందే ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు. మన దేశ ప్రజలందర్నీ స్వాతంత్ర్యోద్యమం ఏకతాటి మీద నిలిపిందన్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికీ మొత్తం ప్రపంచాన్ని గాంధీ సిద్ధాంతం ప్రభావితం చేస్తోందన్నారు. ఆయన మార్గంలో ఉద్యమించడం వల్లే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైందన్నారు కేసీఆర్.

‘ఇవాళ గ్రామాలన్నీ సుసంపన్నంగా మారుతున్నాయి. ప్రజలందరికీ తాగునీరు ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. సంక్షేమానికి పెద్దపీట వేయంలోనూ, రైతు కేంద్రంగా ప్రణాళికలు రచించడంలోనూ, గ్రామీణ ఆర్థిక వృద్ధిపై స్పెషల్ ఫోకస్ చేయడం వెనుకా గాంధీజీ ప్రభావమే ఉంది. మన దేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందన్న బాపూజీ మాటలే మాకు స్ఫూర్తి. ఆయన మాటల ప్రేరణతో గ్రామీణ జీవన ప్రమాణాలను అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈ రోజు తెలంగాణ మోడల్ దేశానికి దిక్సూచిగా నిలిచింది. ఇదే విధంగా అభివృద్ధి నమూనాను కొనసాగిస్తూ సకల జనులకు ప్రగతి ఫలాలను సమానంగా పంచడం ద్వారానే స్వాతంత్ర్యోద్యమ ఆశయాలను పరిపూర్తి చేసుకోగలుగుతాం’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: రోజుకు రూ.2 కోట్లు సంపాదిస్తూ.. ఈ చందాల దందా దేనికి పవన్?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి