iDreamPost

గాయకుడు సాయిచంద్‌ కుటుంబానికి భారీ సాయం.. భార్య, తండ్రి, చెల్లికి కలిపి..

  • Published Aug 29, 2023 | 9:06 AMUpdated Aug 29, 2023 | 9:06 AM
  • Published Aug 29, 2023 | 9:06 AMUpdated Aug 29, 2023 | 9:06 AM
గాయకుడు సాయిచంద్‌ కుటుంబానికి భారీ సాయం.. భార్య, తండ్రి, చెల్లికి కలిపి..

తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు సాయిచంద్ కొన్ని నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉద్యమ సమయంలో.. తన గాత్రం, పాటలతో.. ప్రజలను ఉత్తేజపరిచారు. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్‌తో పాటు.. రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌.. సాయి చంద్‌ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సోమవారం సాయిచంద్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు అధికారులు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రంగారెడ్డి జడ్పీ ఛైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లి ఆయన భార్య, పిల్లలకు.. ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కును అందజేశారు.

సాయిచంద్ భార్య వేద రజనీకి రూ.50 లక్షలు, పిల్లలు చరీష్‌, మీనల్‌లకు చెరో రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.కోటి చెక్కు రూపంలో అందజేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్‌ నాయకత్వమే శ్వాసగా, ఆశగా బతికిన సాయిచంద్‌.. ప్రస్తుంత మన మధ్య లేకపోవడం జీర్ణించుకోలేని విషయమంటూ ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలానే మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, బాల్క సుమన్‌లు.. సాయిచంద్ స్వగ్రామం వనపర్తి జిల్లా అమరచింత వెళ్లి.. ఆయన తండ్రి వెంకట్రాములుకు, చెల్లికి కూడా చెక్కులు అందజేశారు. తండ్రికి రూ.25 లక్షలు, చెల్లెలు ఉజ్వలకు రూ.25 లక్షల చొప్పున చెక్కును అందించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ఉద్యమ గాయకుడు సాయిచంద్‌ తన పాటల రూపంలో ప్రజల హృదయాల్లో కలకాలం నిలిచిపోతారని అన్నారు. సాయి చంద్ గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్ పదవిలో ఉండగానే ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మృతి తర్వాత.. ఆ పోస్టును ప్రభుత్వం ఆయన భార్య రజినీకి కేటాయించిన సంగతి కూడా తెలిసిందే. ఇక తాజాగా సాయిచంద్‌ కుటుంబానికి కేసీఆర్‌ సర్కార్‌ ఏకంగా కోటిన్నర రూపాయల ఆర్థిక సాయం చేయడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి