iDreamPost

మే 3 తర్వాత కూడా తెలంగాణ లాక్ డౌన్.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..

మే 3 తర్వాత కూడా తెలంగాణ లాక్ డౌన్.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..

కరోనా వైరస్ నియంత్రణ కోసం విధించిన లాక్ డౌన్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం విధించిన రెండో దశలో లాక్ డౌన్ మే 3వ తేదీతో ముగుస్తుండగా తెలంగాణ సీఎం కేసీఆర్ దాన్ని మరిన్ని రోజుల పాటు పొడిగించారు. మే 7వ తేదీ వరకు తెలంగాణ లో లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 20వ తేదీ తర్వాత లాక్ డౌన్ సడలింపులపై కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల పైన కూడా తెలంగాణ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి ఆన్లైన్ సైట్ల కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగా తెలంగాణ వాటిపై ఆంక్షలు విధించింది. స్విగ్గీ, జోమాటో ఫుడ్ డెలివరీ పై కూడా ఆంక్షలు విధించింది. లాక్ డౌన్ వల్ల అన్ని కార్యకలాపాలు స్తంభించిన నేపథ్యంలో అద్దె ఇళ్లలో ఉంటున్న కుటుంబాలకు ఉరటనిచ్చేలా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. భూ యజమానులు, ఇళ్ల యజమానులు మూడు నెలల పాటు అద్దె వసూలు చేయకూడదని నిర్ణయించింది. మార్చి , ఏప్రిల్, మే నెలల్లో ఇది వర్తిస్తుందని తెలిపింది. ఇది అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించింది.

కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ఆది నుంచి సీఎం కేసీఆర్ ఎంతో చురుకుగా, కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నారు. గత నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూ ను కేంద్ర ప్రభుత్వం 12 గంటలపాటు విధించగా తెలంగాణలో దాన్ని 24 గంటల పాటు కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 24వ తేదీ రాత్రి దేశంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు చెప్పగా.. అంతకు ఒక రోజు ముందే.. 23 నుంచే లాక్ డౌన్ అమలవుతుందని 22వ తేదీ సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దేశంలో మొదటగా లాక్ డౌన్ ప్రకటించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

మొదటి దశ లాక్ డౌన్ ఏప్రిల్ 14వ తేదీ వరకు కొనసాగుతుందని కేంద్ర ప్రకటించగా తెలంగాణలో మరో రోజు దాన్ని పొడిగిస్తూ 15వ తేదీ వరకు ఉంటుందని కేసీఆర్ వెల్లడించారు. వైరస్ నియంత్రణ లోకి రాకపోవడంతో లాక్ డౌన్ ను 30 వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రకటించకపోయినా తెలంగాణ లో 30 వరకు అమలు చేస్తామని ప్రకటించారు. బతికుంటే బలుసాకు తిని అయినా బతకొచ్చు అని చెబుతున్న సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల ప్రాణాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగానే తాజాగా మే 7 వరకు లాక్ డౌన్ ను పొడిగించారు. దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగనున్నది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి