iDreamPost

కష్ట కాలంలో సీఎం జగన్ పెద్ద మనసు

కష్ట కాలంలో సీఎం జగన్ పెద్ద మనసు

మానవాళికి పెనుముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ నియంత్రణకు ఓవైపు పటిష్టమైన కట్టడి చర్యలు తీసుకుంటేనే.. మరోవైపు కష్ట కాలంలో ప్రజలు ఆదుకునేందుకు ముందుంటున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ప్రభుత్వం తరఫున సహాయం అందించారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు 95 శాతం కుటుంబాలకు ప్రభుత్వ లబ్ధి చేకూరింది. సామాన్యులు, పేదలు ఏ ఒక్కరూ లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి కానీ ధార్మిక సంస్థల నుంచి కానీ ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందని అర్చకులు, ఇమాములు, మౌజమ్ లు, పాస్టర్లకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో ప్రజలు ఇచ్చే కానుకల పైనే ఆధారపడి జీవించే వీరికి ప్రస్తుత కష్ట కాలంలో ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్మానించింది. ఈ మేరకు అర్హులైన వారి వివరాలను కూడా స్వీకరించింది. రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి కానీ ఆయా సంస్థల నుంచి కానీ ఎలాంటి లబ్ధి పొందని అర్చకులు 19 వేలు, పాస్టర్లు 21 వేలు, ఇమాములు, మౌజమ్ లు 7 వేల మంది ఉన్నారని ప్రభుత్వం సర్వే ద్వారా తేల్చింది. వీరందరికీ దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డ్, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 5వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు సంబంధిత సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.

కరోనా నియంత్రణ కోసం గత నెల 24 వ తేదీ అర్ధరాత్రి నుంచి దేశంలో లాక్ డౌన్ అమల్లో ఉంది. నిత్యవసర వస్తువులు, అత్యవసర సేవలు మినహా మిగతా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు అన్ని స్తంభించిపోయాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. పూజలు, ప్రార్థనలు అన్నీ కూడా ఇళ్లలోనే చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు ఇచ్చే కానుకలు పై ఆధారపడి జీవించే అర్చకులు, పాస్టర్లు, మౌజామ్ లు, ఇమామ్లకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. వారి ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని సంకల్పించింది. ఆపద కాలంలో అండగా నిలుస్తున్న జగన్ ప్రభుత్వానికి వారందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి