iDreamPost

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేవాదాయ శాఖ ఉద్యోగులకు గుడ్ న్యూస్!

  • Author singhj Updated - 05:53 PM, Wed - 12 July 23
  • Author singhj Updated - 05:53 PM, Wed - 12 July 23
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేవాదాయ శాఖ ఉద్యోగులకు గుడ్ న్యూస్!

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంగళవారం ఓ భేటీ జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర సర్కారు ఆమోదం తెలిపింది. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన కేబినెట్ భేటీలో 55 అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అసైన్డ్ ల్యాండ్స్ ఉన్న అన్నదాతలకు అనుకూలంగా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ భూములను పొందిన లబ్ధిదారులు 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేలా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇతర అన్నదాతల మాదిరిగానే వారికి కూడా క్రయ-విక్రయాల మీద పూర్తి హక్కులు దక్కుతాయి.

అసైన్​మెంట్ ల్యాండ్స్​తో పాటు లంక భూముల విషయంలోనూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 63,19,184 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్, లంక భూముల విషయంలో 66,111 మందికి పూర్తి హక్కుల్ని కేటాయించింది. ఒరిజినల్ అసైనీలకే ఇది వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ఒరిజినల్ అసైనీలు కాలం చేస్తే.. వారి వారసులకు ఈ రూల్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 1,966 రెవెన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అలాగే రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్ పర్చేస్ పథకం కింద దళితులకు ఇచ్చిన 16,213 ఎకరాల భూములకు సంబంధించి వాళ్లు కట్టాల్సిన రుణాలను మాఫీ చేసి, తద్వారా పూర్తి హక్కులను కల్పించింది.

అర్చకులకు కూడా జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి రిటైర్మెంట్ అనేది లేకుండా చట్టసవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అటు సర్కారు ఉద్యోగుల మాదిరిగా దేవాదాయ శాఖ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయంపై అర్చకులు, దేవాదాయ శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్​కు ధన్యవాదాలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్ర దేవాదాయ శాఖలోని అర్చకులు, ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం నిన్న మరో శుభవార్త అందించిన విషయం తెలిసిందే. పదివేల రూపాయల కంటే తక్కువ జీతంలో పనిచేస్తున్న అర్చకులకు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. అదేవిధంగా రూ.10 వేలు వేతనంగా పొందుతున్న అర్చకులకు రూ.15,625 ఇవ్వాలని జగన్ ప్రభుత్వం ప్రకటించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి