iDreamPost

CM Jagan , YSRCP Plenary: కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్‌

CM Jagan , YSRCP Plenary: కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్‌

2009, సెప్టెంబర్‌ 25న పావురాలగుట్టలో సంఘర్షణ మొదలైంది. ఓదార్పు యాత్రతో పార్టీకి ఒక రూపం వ‌చ్చింది. వైఎస్సార్‌ ఆశయాల సాధన కోసం పార్టీ ఆవిర్భవించింద‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ ప్లీన‌రీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు.

నన్ను ప్రేమించి, నాతో వెన్నుదన్నుగా నిలబడ్డ కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్ చేస్తున్నాన‌ని వైఎస్ జ‌గ‌న్ అన్న‌ప్పుడు ప్లీన‌రీ ద‌ద్ద‌రిల్లిపోయింది. ఈ 13ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. నాకు నాన్న ఇచ్చిన ఈ జగమంత కుటుంబం, నా చేయి ఎప్పుడూ వదల్లేదు. ప్రజలు ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించిన మనకు, ప్రజలు అధికారం కట్టబెట్టారు. ప్రతిపక్షాన్ని 23 ఎమ్మెల్యే సీట్లకు, 3 ఎంపీ సీట్లకు దేవుడు పరిమితం చేశాడ‌ని జ‌గ‌న్ అన్నారు.

మేనిఫెస్టోలో హామీలు ఇచ్చి మాయం చేసే పార్టీలను చూశాం. ప్రజలు నిలదీస్తారేమోన‌న్న భ‌యంతో టీడీపీ మేనిఫెస్టోని మాయం చేసింది. ఆ పరిస్థితి నుంచి, మేనిఫెస్టో అంటే అమలు చేసే ప్రతిజ్ఞగా చూపించాం. ప్రజల ముందు మన మేనిఫెస్టోను పెట్టి, 95 శాతం హామీలు అమలు చేశాం. అందుకే, వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను చూడటానికే, టీడీపీ భయపడే పరిస్థితి వచ్చింద‌ని గ‌ర్వంగా చెప్పిన సీఎం జ‌గ‌న్, ప‌దవి అంటే అధికారం కాద‌ని, ప్రజల మీద మమకారం అని నిరూపించాం. ఇచ్చిన హామీల‌ను నిలబెట్టుకోవ‌డానికి ప్రతిక్షణం తపనపడ్డాం. అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామ‌ని చెప్పారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ వైఎస్సార్‌సీపీ అని గర్వంగా చెప్తున్నామ‌ని అన్న వైఎస్ జ‌గ‌న్, మనపై ఎన్ని రాళ్లు పడ్డా, మనపై ఎన్ని నిందలు వేసినా ఎదుర్కొన్నాం. కుట్రలెన్నిచేసినా, ఎన్ని దాడులు జ‌రిగినా గుండె చెదరలేదు, సంకల్పం మారలేదు. మన ప్ర‌భుత్వ‌ పాలనలో దోచుకోవడం, పంచుకోవడం ఆగిపోయింది కాబట్టే, గజదొంగల ముఠాకు నిద్రపట్టడం లేదు అని సీఎం జగన్ అన్న‌ప్పుడు కార్య‌క‌ర్త‌లు, నేత‌లు హుషారుగా స్పందించారు.

ఆ త‌ర్వాత దుష్టచతుష్ట​యం ప‌న్నాగాల‌ను ఎండ‌గ‌ట్టారు. మన పాలనలో మంచి ని ఓర్వలేక అబద్దాల విషప్రచారం చేస్తుర‌న్న సీఎం, 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఇవాళ నోరు పారేసుకుంటున్నారు. ఆ కట్టుకథల‌కు, అబద్ధాలు జోడించి ఎల్లోమీడియా ప్రచారం చేస్తోంది. గతంలో రాష్ట్రాన్ని దోచుకో, పంచుకో అన్నట్లుగా, గజదొంగల ముఠా వ్యవహరించింది. ఇప్పుడు అవకాశం లేకపోవ‌డంతో, కడుపుమంటతో తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ జనం వెంటే, జనం గుండెల్లోనే ఉంది. గజదొంగల ముఠా మాత్రం, ఎల్లో మీడియా, ఎల్లో సోషల్‌ మీడియాలో మాత్రమే ఉంది. వాళ్లకు, మనకు ఎక్కడా పోలిక ఎక్క‌డ‌? లేదు. మనది చేతల పాలన, వాళ్లది అబద్ధపు విష ప్రచారం అని సీఎం జ‌గ‌న్ చెల‌రేగిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి