iDreamPost

చిత్తూరు: కండక్టర్ నిజాయితీ.. బస్సులో మర్చిపోయిన లక్షల విలువైన బంగారం తిరిగిచ్చాడు

  • Published Aug 09, 2023 | 1:47 PMUpdated Aug 09, 2023 | 1:47 PM
  • Published Aug 09, 2023 | 1:47 PMUpdated Aug 09, 2023 | 1:47 PM
చిత్తూరు: కండక్టర్ నిజాయితీ.. బస్సులో మర్చిపోయిన లక్షల విలువైన బంగారం తిరిగిచ్చాడు

పరుల సొమ్ముతో సమానం అంటారు. మనది కానీ రూపాయి కూడా మనం తీసుకోకూదు అని చెబుతారు పెద్దలు. కానీ ఈ మాటలను ఆచరించే వారు చాలా తక్కువ. కళ్ల ముందు పది రూపాయల నోటు కనిపించినా చాలు.. మనల్ని ఎవరైనా చూస్తున్నారా లేదా అని గమనించి.. దాన్ని అందుకుని చక్కా జేబులో పెట్టుకుని వెళ్లిపోతాం. ఇక అదే బంగారం లాంటి విలువైనవి దొరికితే.. వాటిని తిరిగి ఇచ్చే వాళ్లు నూటికో కొటికో ఒక్కరో.. ఇద్దరో ఉంటారు. ఇదుగో అలాంటి ఓ ఆర్టీసీ బస్‌ కండక్టర్‌ నిజాయతీ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ప్రయాణికులు బస్సులో మర్చిపోయిన లక్షల రూపాయల విలువైన బంగారాన్ని వారికి తిరిగి అప్పగించి తన నిజాయితీ చాటుకున్నాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా, పుత్తూరులో చోటు చేసుకుంది. నిజాయితీ చాటుకున్న కండక్టర్‌ని సత్కరించారు. ఆ వివరాలు..

పుత్తూరు ఎన్జీఓ కాలనీ చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రభాకర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలో.. ఓ ఫంక్షన్‌కు హాజరై సోమవారం తిరుగు ప్రయాణం అయ్యారు. తిరుపతి నుంచి పుత్తూరు వెళ్లేందుకు ఆర్టీసీ బస్‌ ఎక్కారు. గమ్య స్థానం చేరాక.. బస్సులో బ్యాగు మర్చిపోయి దిగిపోయారు. వారు బస్సులో మర్చిపోయిన బ్యాగులో సుమారు 6 లక్షల రూపాయల విలువ చేసే బంగారం ఉంది. ఇంటికి వెళ్లిన తర్వాత బ్యాగ్‌ లేదని గుర్తించారు. ఈలోపు ప్రభాకర్‌ ప్రయాణించిన బస్సు కండెక్టర్‌ వీసీ శేఖర్‌ బ్యాగ్‌ను గుర్తించి.. దాన్ని డిపోలో ఉన్న సెక్యూరిటీ దగ్గర అప్పగించాడు.

ఈలోపు బ్యాగ్‌ మర్చిపోయినట్లు గుర్తించిన ప్రభాకర్‌ కుటుంబసభ్యులు హుటాహుటిన డిపో వద్దకు చేరుకున్నారు. తాము తిరుపతి నుంచి పుత్తూరు వచ్చిన బస్‌లో బ్యాగ్‌ మర్చిపోయామని.. దానిలో సుమారు 6 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం ఉందని తెలిపారు. అయితే ప్రభాకర్‌ బ్యాగ్‌ మర్చిపోవడం గమనించిన.. బస్‌ కండక్టర్‌ శేఖర్‌.. దాన్ని డిపోలో అప్పజెప్పాడని.. బ్యాగు భద్రంగా ఉందని ప్రభాకర్‌కు చెప్పారు. దాంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. బ్యాగ్‌ను భద్రంగా అప్పగించిన కండక్టర్‌ నిజాయితీని ప్రశంసించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి