iDreamPost

సమస్యలపై చిరంజీవి గళం – దక్కాలి ఫలితం

సమస్యలపై చిరంజీవి గళం – దక్కాలి ఫలితం

నిన్న సాయంత్రం జరిగిన లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మధ్య కాలంలో తెగ బోర్ కొట్టిస్తున్న వేడుకలకు భిన్నంగా అమీర్ ఖాన్ రాకతో వేదిక కళకళలాడింది. ఏదో మొక్కుబడి స్పీచులు, అరిగిపోయిన ఏవిలు కాకుండా వచ్చిన ప్రతిఒక్కరు వైవిధ్యంగా మాట్లాడి ఎమోషనల్ గా ఆకట్టుకున్నారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రల ప్రభుత్వాలకు విన్నపం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇండస్ట్రీ సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా ఇద్దరు ముఖ్యమంత్రులు జిఓలు జారీచేస్తే సినిమా మీద ఆధారపడ్డ ఎన్నో కుటుంబాలు గాడిన పడతాయని పబ్లిక్ గానే అడిగారు.

గత కొద్దిరోజులుగా ఏపి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, టాలీవుడ్ పెద్దలతో జగన్ మీటింగ్ కు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి కానీ ఫలించే దిశగా ఎలాంటి పరిణామాలు జరగలేదు. తెలంగాణలోనూ అయిదు షోల అనుమతులు, టికెట్ ధరల పెంపు, మల్టీ ప్లెక్సుల్లో పార్కింగ్ చార్జీల అనుమతి లాంటి ప్రతిపాదనలు పెండింగ్ లో ఉన్నాయి. ఎవరు చొరవ తీసుకుంటున్నా ఇవి పరిష్కారం దిశగా వెళ్లడం లేదు. అందులోనూ చిరంజీవి లాంటి సీనియర్ హీరోలు ఏదైనా చేయాలని వినిపిస్తున్న వేళ ఇలా లవ్ స్టోరీ ఈవెంట్ ని ప్లాట్ ఫార్మ్ గా మార్చుకుని విజ్ఞప్తి చేయడం ఎంతో కొంత ఆలోచనలో పడేయకపోదు.

తన స్వంత సినిమా ఆచార్యనే షూటింగ్ పూర్తయినా ఎప్పుడు విడుదల చేయాలో అర్థం కావడం లేదని చెప్పిన చిరంజీవి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందొ చెప్పకనే చెప్పారు. కేవలం నలుగురైదుగురు బాగుంటేనే పరిశ్రమ బాగున్నట్టు కాదని కొన్ని సినిమాలు ఆడినంత మాత్రాన అంతా పచ్చగా ఉన్నట్టు కాదని స్పష్టం చేయడం గమనార్హం. కరోనా సమయంలో కార్మికులు ఇబ్బందులు పడితే అప్పుడు చేసిన సహాయం కూడా గుర్తు చేశారు. ఏ నిర్ణయమైనా అందరిని దృష్టిలో ఉంచుకోవాలని చిరు చేసిన మెగా విన్నపం ఎలాంటి మార్పు తీసుకొస్తుందో చూడాలి. మొత్తానికి చిరంజీవి సరైన టైంలో సరైన చోట సరైన రీతిలో మాట్లాడారనే కామెంట్లు వినిపిస్తున్నాయి

Also Read : రాజమౌళి సంతృప్తికి అంతం ఉండదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి