iDreamPost

గుర్తు కొస్తున్నాయి… గుర్తుకొస్తున్నాయి…

గుర్తు కొస్తున్నాయి… గుర్తుకొస్తున్నాయి…

స్టడీ సర్టిఫికెట్ కోసం, నేను చదువుకున్న ప్రైమరీ స్కూల్ కి సుమారు 22 ఏళ్ల తర్వాత వెళ్లాల్సి వచ్చింది. దాదాపుగా స్కూల్ మొత్తం మారిపోయింది. స్కూల్ దగ్గరకు వెళ్లి స్కూటీ పార్క్ చేసి స్కూల్ లోపలి వెళ్ళాను. టీచర్ పాఠం చెప్తూ నన్ను చూసి ఏం కావాలండీ అని అడిగింది. స్టడీ సర్టిఫికెట్ కోసం వచ్చాను మేడం అని చెప్పాను. కాసేపు బయట ఉండండి, కంప్లీట్ చేయాల్సిన సిలబస్ చాలా ఉంది. ఒక అరగంట తర్వాత రండి అని మేడం చెప్పింది. ఈలోగా పిల్లలు ఏం చేస్తున్నారా అని తేరిపారా చూసాను.

చీమిడి ముక్కుని చేత్తో తుడుచుకుని గౌనుకు రాసుకుంటున్న చిన్న పిల్లని చూసి నవ్వొచ్చింది. ఆ పిల్లని చూసి నవ్వుకుంటూ స్కూల్ బయటకు నడుస్తూ వెళ్లాను. మెల్లగా నా ఆలోచనలు బాల్యపు జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాయి. మాకు స్కూల్ అందుబాటులో ఉండేది కాదు. ఐదేళ్ల వయసులోనే బస్సు పాస్ ఉండేది. బస్సు ఉదయం 8.30 కి ఉండేది. బస్సు ఎక్కి కండక్టర్ దగ్గర ఉండే బస్సు కడ్డీని గట్టిగా పట్టుకుని నిలబడే వాడిని.ఒకవేళ బస్సు సరైన టైం కి రాకున్నా, ముందే వెళ్ళిపోయినా స్కూల్ కి వెళ్ళాలి అంటే సుమారు 3 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. స్కూల్ కి రెడీ చేస్తూ ముఖం మొత్తం పౌడర్ రాసి బూడిద గుమ్మడికాయలా తయారు చేసేది. నా తలకు అమ్మ రాసిన కొబ్బరినూనె చెంపలపై నుండి కారుతూ మెడవరకు ప్రవహించేది. పౌడర్ మీద కారిన నూనె చారను గమనిస్తే తెల్లటి ఎడారిలో ప్రవహిస్తున్న నూనె నదిలా అనిపించేది.

బస్సు దాటిపోయినప్పుడు ఐదేళ్ల వయసులోనే ఉసూరంటూ 3 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. సరిగ్గా స్కూల్ ఉన్న ఊరిని సమీపిస్తున్నప్పుడు విపరీతమైన భయం వేసేది. ముఖ్యంగా చనిపోయిన పశువుల కళేబరాలను ఊరి చివర పొలిమేరలో పడేసేవాళ్ళు.. అందుకే వాటిని పీక్కుని తినడానికి రాబందులు వచ్చేవి. వాటిని చూడగానే సగం ప్రాణం భయంతోనే పోయేది. ఆ రాబందులు తాటిచెట్టుపై వాలగానే వాటి బరువుకి తాటి ఆకులు మువ్వతో సహా కిందకి వంగేవి. అవి పశువుల కళేబరాలు పీక్కు తింటుంటే నన్ను ఎక్కడ ఎత్తుకుపోతాయో అని బిక్కుబిక్కుమంటూ భయంతో వణుకుతూ స్కూల్ కి వెళ్ళేవాడిని.

స్కూల్ ఇంటర్వెల్ లో ఆడే ఆటలైతే భలే ఉండేవి. బలపాలను పందెం వేసుకుని ఆడిన ఆటలు పిన్నీసుల కోసం ఆడే ఆటలు, గోళీలాటలు, స్టంపర్ బాల్ తో ఆడే వీపు ముద్రలు, బచ్చాలాటలు అన్నీ భలే ఉండేవి. ఇంటర్వెల్ లో ఎన్నో ఆటలు హుషారుగా ఆడుకుంటూ అరగంట సమయం గడిపేసేవాళ్ళం. పగిలిపోయిన ఇంటి పెంకులు దొరికితే వాటిని ఎత్తు నుండి దిగువ వరకూ వరుసగా రాళ్ల సహాయంతో పేర్చి ఒక కాలువలాగా పేర్చేవాళ్ళం. ఆ పెంకుల కాలువపై మూత్ర విసర్జన చేస్తూ అదొక నీటి ప్రాజెక్టుగా ఊహించుకుంటూ పెంకుల ద్వారా పరుగులెడుతున్న మూత్రాన్ని చూస్తూ కేరింతలు కొట్టడం గుర్తు చేసుకుంటే ఆ రోజుల్లోకి తిరిగి వెళ్లి బాల్యాన్ని అనుభవించాలనిపిస్తుంది.

ఒక గోనె సంచిని తీసుకెళ్లి టైలర్ కి ఇస్తే, పుస్తకాల పెట్టుకునే బాగ్ లా కుట్టి ఇచ్చేవాడు. ఆ బాగ్ లో పుస్తకాలు పెట్టుకుని తలకు ఆ బాగ్ పొడుగ్గా తగిలించుకుని,వెళ్లడం ఊహించుకుంటుంటే ఏదో తెలియని ఆనందం మనసులో కలుగుతుంది. నాకుండే మట్టిపలకపై ఉమ్ము ఊసి,ఆ ఉమ్ముని పలక మొత్తం రుద్దుతూ పలక నిండా రాసిన అక్షరాలను చెరుపుకోవడం లీలగా గుర్తొస్తుంది. పలకలు బాగా రాయాలని, పలక ఆకుని నలిపి ఆ ఆకు పసరుతో పలక మొత్తం రుద్దితే పలక తళతళా మెరిసేది.ఆకుతో రుద్దిన తరువాత బలపంతో అక్షరాలు రాస్తే అక్షరాలు తెల్లగా ప్రకాశవంతంగా మెరిసేవి. ఒక్కోసారి బొగ్గుని తడిపి పలకను రుద్ది కాసేపు దాన్ని ఎండబెట్టిన తర్వాత నీళ్లతో కడిగి బలపంతో అక్షరాలు రాస్తే ప్రకాశవంతంగా మెరిసేవి.

ఇక చిన్నపాటి వెదురు బొంగులతో తయారు చేసుకున్న పిస్టల్ లోకి ముందొక పాపిడి కాయను కూర్చి దాని వెదురుగొట్టం చివర వరకూ తోసి రెండో పాపిడి కాయను అదే గొట్టంలోకి వెదురు పుల్లతో తోస్తే “టప్” అని పేలుతూ పాపిడి కాయ దూసుకుపోయేది. వెదురు గొట్టాలతో పాపిడి కాయలను పేలుస్తూ, దాన్నొక గన్ లాగ మురిసిపోతూ జేమ్స్ బాండ్ లాగా పోజులు కొట్టడం ఇంకా గుర్తుంది. దీనికి తోడు పక్కనున్న పిల్లలతో గొడవలు పడటం, గిల్లుకోవడం, అల్లరి చేస్తూ టీచర్ల చేతిలో దెబ్బలు తినడం ఇలా అన్నీ గుర్తొస్తే మనసుకు తెలియని ఆనందం కలుగుతుంది. పిల్లల అల్లరిని తట్టుకోలేక టీచర్ నోటిపై వేళ్ళు వేసుకోమని చెప్పడం, నోటిమీద వేళ్ళు వేసుకోకుండా ముక్కుపై వేలు పెట్టుకుని పక్కనున్న పిల్లలతో గుసగుసలాడటం లాంటి విషయాలతో కూడిన జ్ఞాపకాల జడి తిరిగి నన్ను బాల్యానికి తీసుకుపోయింది.

అన్నయ్య నిన్ను టీచర్ గారు పిలుస్తున్నారన్న చిన్న పాప పిలుపుతో మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చాను. టీచర్ గారి దగ్గరకు వెళ్లి నేను చదివిన సంవత్సరం చెప్పేసరికి శిథిలావస్థలో ఉన్న రికార్డులను దులిపి చిరిపోయిన పేజీలను అతికించి మొత్తానికి నా స్టడీ సర్టిఫికెట్ ఇచ్చింది టీచర్. స్కూల్ పిల్లల కోసం చాక్ పీసులు, బలపాలు కొని టీచర్ కి ఇచ్చి అప్పటికే మదిని కుదిపేస్తున్న జ్ఞాపకాల జడిని నెమరు వేసుకుంటూ ఉసూరంటూ తిరిగి ఇంటికి బయల్దేరాను.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి