iDreamPost

ప్రశాంత్ కిషోర్ కాపీ కొట్టాడట!!

ప్రశాంత్ కిషోర్ కాపీ కొట్టాడట!!

ఇటీవలే జెడియు నుండి బయటకి వచ్చిన దేశంలోనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై పాట్నాలోని పటాలిపుత్ర పోలీస్ స్టేషన్‌లో మోసం, కంటెంట్ దొంగతనం ఆరోపణలపై ఐపిసి సెక్షన్లు 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసు పై పాట్నా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా దీనిపై ఇప్పుడు బీహార్ తో పాటు ఢిల్లీ రాజకీయవర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతుంది.

ఇటీవల ప్రశాంత్ కిషోర్ ప్రకటించిన ‘బాత్ బీహార్ కి’ ప్రచారానికి తన అనుమతి లేకుండా తన కంటెంట్‌ను ఉపయోగించారని ఆరోపిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సలహాదారుగా, కాంగ్రెస్ లో డేటా అనలిటిక్స్ కోఆర్డినేటర్ గా పనిచేసిన శశ్వత్ గౌతమ్ ఆరోపించాడు. ఈ మేరకు శశ్వత్ గౌతమ్ ప్రశాంత్ కిషోర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార నినాదం, లోగో మరియు డేటాను తనదగ్గర నుండి ప్రశాంత్ కిషోర్ దొంగిలించినట్లుగా శశ్వత్ గౌతమ్ ఆరోపించారు. అసలు ఈ ‘బాత్ బిహారీ’ కంటెంట్, టైటిల్ తనదేనని ఒసామా అనే మరో వ్యక్తితో తాను కంటెంట్‌ను అభివృద్ధి చేశానని శశ్వత్ చెప్పుకొచ్చాడు.

త్వరలో తన సొంత రాష్ట్రం బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇటీవలే ప్రశాంత్ కిషోర్ ‘బాత్ బీహార్ కి’ కార్యక్రమాన్ని ప్రకటించారు. దీని ప్రకారం దేశంలోనే 10 ఉత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా బీహార్‌ను మార్చడమే తన లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ ప్రకటించాడు. ఈ కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ఎన్నికలకు 100 రోజుల ముందు తాను బీహార్ అంతటా పర్యటిస్తానని, ఈ పర్యటన ద్వారా రాష్ట్ర యువతని ప్రోత్సహించి తద్వారా యువ నాయకత్వాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పారు.

గత జనవరిలో జెడి (యు) ప్రశాంత్ కిషోర్‌ను పార్టీ నుండి బహిష్కరించిన తరువాత, గతవారం విలేకరుల సమావేశం నిర్వహించిన ప్రశాంత్ కిషోర్, నితీష్ కుమార్ ని సునితంగానే విమర్శిస్తూ గత 15 ఏళ్లలో బీహార్ ని అభివృద్ధి చెయ్యడంలో నితీష్ విఫలమయ్యారని, ఇన్ని సంవత్సరాల నితీష్ పాలన తర్వాత కూడా బీహార్ పేద రాష్ట్రంగానే కొనసాగుతోందని, కేవలం అధికారం కోసమే బిజెపి ముందు నితీష్ కుమార్‌ లొంగిపోయారని పీకే ఆరోపించారు.

శశ్వత్ గౌతమ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ప్రశాంత్ కిషోర్ కొట్టిపారేశాడు. ఏదిఏమైనా గతంలో నరేంద్ర మోడీ కోసం చాయ్ పే చర్చ, మన్కి బాత్, వంటి కార్యక్రమాల వెనుక కీలక సూత్రధారిగా దేశప్రజలందరి దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ కిషోర్ ఆ తరువాత రాహుల్ గాంధీ కోసం కూడా పని చేశారు. ఇటీవల ఏపీలో వైయస్ జగన్ విజయంలో కీలకపాత్ర వహించి ఎన్నికల వ్యూహాకర్తగా మంచి పేరు తెచ్చుకొన్నపీకే ఇటీవల కాలంలో సీఏఎ, ఎన్సీఆర్ లను ప్రవేశపెట్టడం అప్రజాస్వామికం అంటూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి, అమిత్ షా కి వ్యతిరేకంగా బహిరంగంగానే తీవ్ర వ్యాఖ్యలు చెయ్యడం, ఇదే సమయంలో నితీష్ కుమార్ తో సిద్ధాంతపరంగా వ్యతిరేకించి జెడియు నుండి బహిష్కరణకు గురవ్వడం వంటి రాజకీయ పరిసస్థితుల్లో కేవలం రాజకీయమైన కారణాలతోనే పీకే పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కేంద్రంలోని పెద్దలే ఉద్దేశపూర్వకంగా ఇదంతా నడిపిస్తున్నట్టు అర్ధం చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి