iDreamPost

ఇస్రోపై పాకిస్థాన్ నటి పొగడ్తలు.. తాము సిగ్గుతో తలదించుకుంటున్నామంటూ..!

  • Author singhj Published - 09:57 PM, Wed - 23 August 23
  • Author singhj Published - 09:57 PM, Wed - 23 August 23
ఇస్రోపై పాకిస్థాన్ నటి పొగడ్తలు.. తాము సిగ్గుతో తలదించుకుంటున్నామంటూ..!

చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్​తో అంతరిక్ష చరిత్రలో భారత్ కొత్త చరిత్రను లిఖించింది. ఈ విజయం కోసం దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఊపిరి బిగపట్టి నిమిషాలు లెక్కించారు. కొన్ని నెలల పాటు ఎంతో కష్టపడిన ఇస్రో సైంటిస్టులు.. ఇవాళ కాలం మరిచి పనిచేశారు. బుధవారం సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయానికి చంద్రుడి మీద భారత మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. సైంటిస్టులు భావోద్వేగంతో చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టారు. చంద్రయాన్-2 మిషన్ విజయానికి అడుగు దూరంలో కుప్పకూలడాన్ని దేశం మొత్తం ఇప్పటికీ మర్చిపోలేదు.

చంద్రయాన్-2 ఫెయిల్యూర్ సమయంలో ఇస్రో దిగ్గజ సైంటిస్ట్, ఛైర్మన్ శివన్ కన్నీళ్లు పెట్టుకోవడం యావత్ భారతావని దిగ్భ్రాంతితో వీక్షించింది. అప్పట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో ఛైర్మన్​ను ఓదార్చారు. మరోసారి ప్రయత్నిద్దామని.. తప్పక సక్సెస్ అవుతామని భరోసా ఇచ్చారు. ఆయన చెప్పినట్లే చంద్రయాన్-3 రూపంలో భారత్ అపురూప విజయాన్ని సాధించింది. గతంలో ఎదురైన ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న ఇస్రో.. ఈసారి ఎలాగైనా సాఫ్ట్ ల్యాండింగ్​ను విజయవంతమయ్యేలా రూపొందించింది. దీని కోసం చంద్రయాన్-2 టైమ్​లో జాబిల్లి కక్ష్యలోకి చొప్పించిన ఆర్బిటర్ నుంచి అందుకొన్న సమాచారాన్ని విశ్లేషించింది. ప్రాజెక్ట్ ఫెయిల్యూర్​కు గల కారణాల్లోని అంశాలను ఇస్రో గుర్తించింది. అందుకే ఈసారి విక్రమ్ ల్యాండర్​కు మరింత స్వేఛ్చనిచ్చారు.

చంద్రయాన్-3లో ఇంజిన్లను కంట్రోల్ చేసేందుకు అదనపు సాఫ్ట్​వేర్​ను జోడించారు సైంటిస్టులు. తగినంత టైమ్ తీసుకోవడానికి అదనపు శక్తిని ఇచ్చేలా సోలార్ ప్యానళ్లను అమర్చారు. మొత్తానికి శాస్త్రవేత్తల ప్రయత్నాలు ఫలించి జాబిల్లిపై చంద్రయాన్-3 సేఫ్​గా ల్యాండ్ అయింది. దీంతో ప్రపంచ దేశాలు భారత్​పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. చంద్రయాన్-3 విజయవంతం కావడం మీద పాకిస్థాన్ స్టార్ నటి సెహర్ షిన్వారీ ఇండియాకు విషెస్ తెలిపారు. ‘ఇండియాతో శత్రుత్వాన్ని పక్కనబెడితే ఇస్రోను అభినందించాల్సిందే. భారత్​ను అందుకోవడానికి పాకిస్థాన్​కు 2 నుంచి 3 దశాబ్దాలు పడుతుంది. ఇండియా ఎంత ఎత్తుకు ఎదిగిందో చూసి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది’ అని సెహర్ ట్వీట్ చేశారు. పాక్ సిగ్గుతో తలదించుకోవాలంటూ ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి