iDreamPost

అప్పుడు ఆప్ఘనిస్తాన్, ఇప్పుడు శ్రీలంక: నోటికొచ్చింది మాట్లాడడమేనా బాబు?

అప్పుడు ఆప్ఘనిస్తాన్, ఇప్పుడు శ్రీలంక: నోటికొచ్చింది మాట్లాడడమేనా బాబు?

ఏపీలో మళ్లీ అధికారంలోకి రాగలమనే ధీమా లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ తీవ్రంగా తల్లడిల్లిపోతోంది. ఆ క్రమంలో ఏమి చేయడానికైనా సిద్ధమన్నట్టుగా సాగుతోంది. చివరకు రాష్ట్ర పరువుని తీయడానికి కూడా వెనుకాడడం లేదు. ఆంధ్రప్రదేశ్ ని అవమానించడానికి కూడా సిద్ధపడిపోతోంది. చంద్రబాబుతో పాటుగా ఆయన పార్టీ నేతల మాటలు చూస్తుంటే రాష్ట్రం మీద వీసమెత్తు ప్రేమ కూడా లేదని అర్థమవుతోంది. తమకు అధికారం లేని రాష్ట్రం అధోగతి పాలుకావాల్సిందేనని ఆశిస్తున్నట్టు స్పష్టమవుతోంది. వరుసగా టీడీపీ వ్యవహారశైలి దానికి అద్దంపడుతోంది.

కొన్ని నెలల క్రితం ఆప్ఘనిస్తాన్ లో తాలిబాన్ల రాజ్యం ప్రారంభంకాగానే ఏపీని తాలిబాన్ల రాజ్యమని, మరో ఆప్ఘనిస్తాన్ అని కూడా చంద్రబాబు అనేశారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల గురించి మాట్లాడడంలో తప్పులేదు. విమర్శల్లో నేరం లేదు గానీ..మరీ ఆప్ఘనిస్తాన్ అంటూ ఏపీ గురించి వ్యాఖ్యానించడం చాలామందిని విస్మయానికి గురిచేసింది. ఇప్పుడు మరోసారి శ్రీలంక అయిపోతుందంటూ విమర్శించేస్తున్నారు. అసలు శ్రీలంక సంక్షోభానికి కారణాలు తెలియకుండానే చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆయన తీరుని తేటతెల్లం చేస్తున్నాయి. అధికారం లేకపోయేసరికి ఆయన నోటికొచ్చింది మాట్లాడేందుకు సిద్ధమయిపోయారని భావించాల్సి వస్తోంది.

శ్రీలంక విదేశీ అప్పుల మీద ఆధారపడింది. అదే సమయంలో అప్పులు చెల్లించడానికి అవసరమైన ఆదాయం తగ్గిపోయింది. కరోనా సహా వివిధ కారణాలతో టూరిజం పడిపోవడం పెద్ద అవరోధం అయ్యింది. అదే సమయంలో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటూ టీ, రబ్బరు సాగులో తీసుకొచ్చిన మార్పుమూలంగా ఉత్పత్తి పడిపోయింది. దాంతో ఎగుమతులు పడిపోయి, ఆహారధాన్యాల సహా దిగుమతులు పెరగడం విదేశీ మారకద్రవ్య నిల్వల్లో తేడా వచ్చింది. అదే సమయంలో తెచ్చిన అప్పులను ప్రజల సంక్షేమానికి కాకుండా నాయకుల ఆడంబరాలకు వెచ్చించి వ్యవస్థను దిగజార్చేశారు. మరిన్ని అప్పులు చేసి కష్టాల్లో కూరుకుపోయి సంక్షోభంలో కొట్టిమిట్టాడుతోంది. కానీ ఏపీ అందుకు విరుద్ధం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రపంచబ్యాంకు నుంచి అప్పులు తీసుకొస్తే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నది దేశీయ సంస్థల నుంచి. అది కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే.

అంతేగాకుండా ఏపీలో ఆహారధాన్యాలు,ఆక్వా, అరటి సహా వివిధ ఎగుమతులు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల్లోనే ఎగుమతులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ ముందంజలో ఉంది. అంటే దిగుమతుల కన్నా ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయంటే వ్యవస్థ పటిష్టమవుతున్నట్టేననే సంగతి చంద్రబాబు విస్మరించేశారు. ఏపీని శ్రీలంకతో పోల్చేసి సంతృప్తిపడుతున్నారు. ప్రజలు ఇలాంటి మాటలను పట్టించుకోవడం లేదనే విషయాన్ని కూడా వదిలేశారు. ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ సామాన్యుడి చేతుల్లోకే చేరుతున్న సంగతి మరచిపోతున్నారు. ఇలాంటి తీరువల్లనే టీడీపీ రానురాను కుచించుకుపోతున్నా ఆయన ఖాతరు చేయకపోవడమే ఆపార్టీ దుస్థితికి కారణంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి