iDreamPost

ఆ విషయంలో పవన్‌ను ఫాలో అవుతున్న చంద్రబాబు..

ఆ విషయంలో పవన్‌ను ఫాలో అవుతున్న చంద్రబాబు..

2014 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కొన్నిసార్లు ప్రత్యక్షంగా, మరికొన్ని సార్లు పరోక్షంగా చంద్రబాబుతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. చంద్రబాబుకు ఏ కష్టమొచ్చినా తానున్నానంటూ వచ్చి.. ఇష్యూను డైవర్ట్‌ చేసి వెళ్లిపోవడం పవన్‌కు వెన్నతో పెట్టిన విద్య. విభిన్న పార్టీలతో పొత్తుల దగ్గర నుంచి రోజుకో మాట, ప్రాంతానికో మాట, యూటర్న్‌లు.. ఇలా అన్నింట్లోనూ చంద్రబాబును ఫాలో అవుతుంటారు పవన్‌కల్యాణ్‌. అయితే ఈ సారి రివర్స్‌లో పవన్‌నే ఫాలో అవుతున్నారు చంద్రబాబు. అదే పార్ట్‌టైమ్‌ రాజకీయం. ఏదో ఒక విషయం మీద అది చేస్తా ఇది చేస్తా అంతు చూస్తానంటూ ప్రగల్బాలు పలకడం, రెండు రోజులు హడావుడి చేయడం, ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోవడం చేస్తుంటారు పవన్‌. గతంలో ఎన్నోసార్లు ఈ విషయం రుజువైంది. ఇప్పుడు పవన్‌ మార్గాన్నే చంద్రబాబు ఫాలో అవుతున్నారు. రెండు రోజులు విజయవాడలో ఉంటే.. ఐదు రోజులు హైదరాబాద్‌కు చెక్కేస్తున్నారు చంద్రబాబు. దీంతో నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. హైదరాబాద్‌ వెళ్లిన 5 రోజులు.. ఎవ్వరికీ కనీసం ఫోన్‌లో కూడా అందుబాటులో ఉండడం లేదట. తన అతి ముఖ్యమైన కోటరీకి మాత్రమే అక్కడ అపాయింట్‌మెంట్‌ ఉంటోదట.

పోయిన వారమే చంద్రబాబు ప్రజాచైతన్యం యాత్రలు చేస్తున్నానంటూ ప్రకటించారు. 45 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్య పరుస్తానన్నారు. ప్రభుత్వం వల్ల నిజంగా ప్రజలు మోసపోతే.. వాళ్లే తిరుగుబాటు చేస్తారు.. అంతేగానీ మనం వెళ్లి ఏం చైతన్యపరుస్తామని నాయకులు సూచించినా చంద్రబాబు వినలేదు.. యాత్రలు చేయడానికి ఇది సరైన సమయం కాదన్నా ఒప్పుకోలేదు. ప్రకాశం జిల్లా మార్టూరులో పోయిన బుధవారం యాత్ర ప్రారంభించారు. అంతే ఒక్కరోజుకే ముగించేసి చంద్రబాబు హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఆ తర్వాత కార్యాచరణ ఏంటి అనేది ఎవరికీ చెప్పలేదట. దీంతో రెండు రోజులు ఒకటి ఆరా చోట్ల స్థానిక నాయకులు ఆ కార్యక్రమాన్ని చేసి వదిలేశారు. మళ్లీ ఐదు రోజుల తర్వాత సోమవారం మళ్లీ కుప్పంలో చంద్రబాబు యాత్ర ప్రారంభిస్తున్నారు. ఈసారి కూడా కేవలం మూడు రోజుల షెడ్యూల్‌ మాత్రమే చెప్పారట. ఏదో సామెత చెప్పినట్లు కొన్నాళ్లు ఒకరితో ఒకరు సావాసం చేస్తే వాళ్లు వీళ్లు అవుతారన్నట్లుగా.. చంద్రబాబు ఆలోచనలు, విధానాలు పవన్‌కు బదిలీ అయ్యి, పవన్‌ పార్ట్‌టైమ్‌ రాజకీయాలు చంద్రబాబుకు బదిలీ అయ్యాయని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి