iDreamPost

ఉనికి గుర్తించట్లేదనుకొంటూ ఉనికి కోల్పోతున్న బాబు .

ఉనికి గుర్తించట్లేదనుకొంటూ ఉనికి కోల్పోతున్న బాబు .

సహజంగా ఎవరైనా ప్రసవిస్తే పలకరించటానికి పోయిన వారు సదరు ప్రసవించిన మహిళ ఆరోగ్య స్థితి విచారించి ఎదో నాలుగు కాయలు , బ్రెడ్డు ఇచ్చి వస్తారు . క్లిష్ట పరిస్థితుల్లో ప్రసవం జరిగివుంటే సర్జరీ చేసిన డాక్టర్ ని అభినందిస్తారు . కొండకచో హాస్పిటల్ పరిసరాలు బావుండి , సేవలు , వసతులు బావుంటే కొంత సమయం వేచి ఉండి హాస్పిటల్ సూపరింటెండెంట్ ని అభినందించి వస్తారు .

కానీ ఒక కాన్పు జరిగింది అని తెలియగానే ప్రసవించిన మహిళని , పురిటి గుడ్డుని చూడకుండా , పుట్టింది ఆడో మగో తెలియకుండా , డాక్టర్ సేవల్ని తెలుసుకోకుండా , హాస్పిటల్ స్థితిగతులు గమనించకుండా , అసలు హాస్పిటల్ కే వెళ్లకుండా మీ వైద్యం , మీ సేవలు ,మీ స్పందన అద్భుతం , అమోఘం , అనిర్వచనీయం అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి , ప్రధాన మంత్రికి , రాష్ట్రపతికి , అడ్రెస్ ఎలాగోలా పట్టుకొని WHO కి , ఐక్యరాజ్య సమితికి ధన్యవాదాలు తెలిపేవాణ్ణి విజనరీ అంటారు . సామాన్యులు చంద్రబాబు అనొచ్చుగాక అది ఆయనకి పట్టింపు లేదు . ఆయన దృష్టిలో ఆయనో సూపర్ విజనరీ .

ఇందుకు పలు దృష్టాంతాలు మనకి సాక్ష్యంగా కనపడుతున్నా ఇటీవలి సంఘటనలు రెండు తీసుకొందాం . కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ ప్రకటించటానికి నాల్రోజులు ముందే హైద్రాబాద్ వెళ్లి సెటిలైన బాబు లాక్ డౌన్ తర్వాత రాష్ట్రంలో తనవంతు సేవలు ఏమీ అందించకపోగా అనునిత్యం ప్రతి ప్రభుత్వ చర్యలోనూ వంకలు పెట్టటమే పరమావధిగా ఆరోపణలు చేశారు తప్ప , బాధ్యత గల ప్రతిపక్ష నేతగా వారి 40 ఏళ్ల అనుభవంతో నిర్ధిష్టమైన సలహా , సూచనలు చేసింది లేదు . అయితే ప్రపంచ మేధావులతో తానో కమిటీ వేశానని , వారితో సుదీర్ఘంగా చర్చించి ప్రధాని కార్యాలయానికి పలు సలహాలతో లేఖ రాశానని ఆ తర్వాత ప్రధానితో రెండు నిమిషాలు మాట్లాడాలని కోరగా మరుసటి రోజు ఫోన్ చేసి “రెండు నిమిషాలు” మాట్లాడారని “చాలా విషయాలు” చర్చించారని , అందుకు గాను తనకు తనకు ఎంతో సంతోషమైందని చెప్పుకొచ్చారు .

అమూల్య సలహాలు , సూచనలు పొందుపరిచిన సదరు లేఖ ప్రతిని మాత్రం బయట పెట్టలేదు . అది బయట పెడితే రాష్ట్రాలు ఆయాచితంగా తన సలహాలు వాడుకొంటాయనుకొన్నారేమో . కనీసం తాను 40 ఏళ్ళు రాజకీయం చేసి , 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన రాష్ట్రానికైనా ఆ లేఖ ప్రతిని ఇవ్వలేదు . తనని జూమ్ చేసి అడగలేదు అని అంతులేని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి వేడినీళ్ళల్లో ఉప్పు వేసుకొని పుక్కిలించమని సలహా ఇచ్చారు. అలాగే ఎడమ చేత్తో చేసే పని కుడిచేత్తో చేయమని వారి తనయుడు మాజీ ఐటీ మినిస్టర్ లోకేష్ మరో సలహా ఇచ్చారు. కానీ లేఖలోని రహస్యాలు మాత్రం విప్పలేదు . అయితే సదరు లేఖని PMO నీతి ఆయోగ్ కి పంపిందని , వారు తన సలహాలని మెచ్చుకొంటూ తిరిగి లేఖ పంపారని ఓ లేఖని బయట పెట్టారు .

మీరు పంపిన లేఖ బయట పెట్టకపోవడం ఏమిటీ , PMO కి కరోనా వైరస్ గురించి సలహాలు చెబుతూ లేఖ పంపితే వారు ఆరోగ్య శాఖకు రిఫరెన్స్ పంపుతారు కానీ నీతి ఆయోగ్ కి పంపటం ఏమిటీ ఇది అనుమానించదగ్గ లేఖ , మీరు పంపిన లేఖకి , మీకు వారు పంపిన లేఖకి ధ్రువీకరణ ఏంటీ , అసలు మీరిచ్చిన సలహాలు ఏంటీ అన్న ప్రశ్నలకు సమాధానాలు జనం అడక్కూడదూ వారు చెప్పరు .

అదలా ఉంటే వైజాక్ గ్యాస్ దుర్ఘటన జరిగిన రోజు తాను నివాసం ఉంటున్న హైదరాబాద్ నుండి ఏపీకి రావటానికి ఎవరైనా ఏపీ డీజీపీ పెర్మిషన్ , తెలంగాణా డీజీపీ పెర్మిషన్ అడిగి వస్తారు . కానీ బాబు గారి స్థాయి వేరు కదా , విచిత్రంగా ప్రధాని కార్యాలయాన్ని , కేంద్ర హోమ్ శాఖని పెర్మిషన్ అడిగారు . వచ్చేసింది పెర్మిషన్ , వచ్చేస్తుంది పెర్మిషన్ అంటూ రెండ్రోజులు కాలక్షేపం చేసి పూలతో ఎదురు చూసిన టీడీపీ శ్రేణుల్ని ఉసూరుమనిపించారు .

తదనంతరం జూమ్ వీడియోలో మాట్లాడుతూ ఐఏఎస్ లకు ఏమీ తెలీదని , కోటి రూపాయల పరిహారం ఇస్తే సరిపోతుందా అని , తన పార్టీ తరుపున అచ్చెన్నాయుడు ఎమ్ఎ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేశారు . అలాగే సదరు ఘటన జరగ్గానే స్పందించినందుకు అభివాదములు అంటూ ప్రధానికి ఓ లేఖ రాసి మీడియాకి విడుదల చేసారు .

దుర్ఘటన జరిగిన వెంటనే స్పందించిన పోలీస్ శాఖ సిబ్బందికి కానీ , సత్వరం వైద్య సేవలకు ఉపక్రమించిన ఆరోగ్య శాఖ సిబ్బందికి కానీ , రాష్ట్ర ప్రభుత్వానికి కానీ , హుటాహుటిన వైజాక్ పోయి ఘటనా స్థలిని పరిశీలించి , బాధితుల్ని పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చి నష్టపోయిన పశువులతో సహా అంచనాలు రూపొందించమని ఆదేశించి అందుకనుగుణంగా బాధితులకు ఆమోదయోగ్యంగా భారీ పరిహారాన్ని ప్రకటించి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి కానీ చంద్రబాబుకి కనపడకపోవటం గమనార్హం .

14 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి , మరో నాయకుడు ముఖ్యమంత్రిగా సమస్యలని ఎదుర్కొంటున్న ప్రజలకు అండగా కృషి చేస్తున్నప్పుడు ఆ నాయకుణ్ణి అభినందించటానికి ఇష్టపడకపోయినా కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానానికి సైతం విలువ ఇవ్వక క్లిష్ట పరిస్థితుల్లో చిన్న అభినందనతో బాసటగా నిలవకపోగా అడ్డగోలు ఆరోపణలు చేయడం బాబు వ్యక్తిత్వ పతనాన్ని సూచిస్తుంది . ముఖ్యమంత్రిని కాకపోయినా గ్యాస్ లీకేజీ వంటి క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహించిన ఆయా శాఖల అధికారులు , ఐఏఎస్ లను అభినందించకపోగా , ఐఏఎస్ లకు ఏమి తెలుసు అంటూ నాకే ఎక్కువ తెలుసు అనే అహంభావ వ్యాఖ్యలు బాబు నైతికంగా ఎంత దిగజారిపోయాడో తెలియజేస్తున్నాయి .

ఓ ప్రతిపక్ష నాయకుడిగా 40 ఏళ్ళు తన రాజకీయ , ఆర్ధిక ఎదుగుదలకు ఉపయోగపడ్డ రాష్ట్ర ప్రజల కోసం పని చేయకుండా , వారి క్షేమాన్ని , అభివృద్ధిని విస్మరించి , రాష్ట్రంతో సంబంధాలు లేకుండా , నేటికీ వారిని తన రాజకీయానికి అనుకూలంగా వాడుకునే ఉద్దేశ్యంతో వాస్తవ పరిస్థితుల్ని వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కించపరుస్తూ కేంద్ర ప్రాపకం కోసం లేఖల డ్రామాలతో పాటుపడుతున్న బాబుని రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది విస్మరించారు అనడానికి నిన్నటి ఎన్నికలే పెద్ద ఉదాహరణ . బాబు ఇదే తీరు కొనసాగిస్తే సమీప భవిష్యత్తులో మిగతా ప్రజలు కూడా ఆయన్ని మరిచిపోతారనడంలో సందేహం లేదు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి