iDreamPost

జూమ్‌ ఉండగా.. అసెంబ్లీ దండగ..!

జూమ్‌ ఉండగా.. అసెంబ్లీ దండగ..!

ఐటీ, కార్పొరేట్‌ కంపెనీలు వీడియో కాన్ఫరెన్స్‌ కోసం ఉపయోగించే జూమ్‌ యాప్‌ కరోనా వల్ల బాగా ప్రాచూర్యం పొందింది. తమ ఉనికిని ప్రజలకు, పార్టీ శ్రేణులకు తెలియజేసేందుకు రాజకీయపార్టీల నేతలు ఎక్కువగా మీడియాను ఆశ్రయిస్తుంటారు. అయితే కరోనా కారణంగా ప్రెస్‌మీట్లు నిర్వహించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు జూమ్‌ యాప్‌ ద్వారా మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. జూమ్‌ యాప్‌ను ఉపయోగించే వారిలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందు వరసలో ఉన్నారు. బహుసా దేశంలోనే అత్యధికంగా జూమ్‌ను ఉపయోగించేది చంద్రబాబే కావచ్చు.

ప్రెస్‌మీట్లు, పార్టీ నేతలతో సమీక్షలు, చివరికి మహానాడును కూడా జూమ్‌ యాప్‌లో నిర్వహించారు చంద్రబాబు. తన అభిప్రాయలు చెప్పేందుకు, మధ్యలో ఎక్కడా అంతరాయం లేకుండా మాట్లాడేందుకు జూమ్‌ యాప్‌ బాగుందని భావించారేమో గానీ చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడాల్సిన విషయాలు కూడా జూమ్‌లోనే మాట్లాడుతున్నారు. అందుకేనేమో అసెంబ్లీలో ఉండేందుకు ఇష్టపడడంలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

నిన్న అసెంబ్లీ ప్రారంభమై గవర్నర్‌ ప్రసంగం మొదలు, ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలోనూ, ఈ రోజు వివిధ బిల్లులు సభ ముందుకు వచ్చే సమయంలోనూ చంద్రబాబు అసెంబ్లీలో ఉండలేదు. తమ పార్టీ నేత అచ్చెం నాయుడు అరెస్ట్‌పై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ సాధ్యం కాని డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వలేదనే సాకుతో అసెంబ్లీ నుంచి వాక్‌ అవుట్‌ చేస్తున్నారు. నిన్నటి నుంచి ఇదే పంథాను చంద్రబాబు అమలు చేస్తున్నారు.

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సమయంలో అక్కడ ఉండకుండా బయటకు వచ్చిన చంద్రబాబు నిన్న సాయంత్రం జూమ్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టారు. దాదాపు గంట 10 నిమిషాల సేపు బడ్జెట్‌పై మాట్లాడారు. బడ్జెట్, కేటాయిపులపై విమర్శలు చేశారు. అదే సమయంలో అచ్చెం నాయుడు అరెస్ట్‌ వ్యవహారం, ఇతర రాజకీయాలు, మోదీతో తనకున్న బంధం తదిరాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఎప్పటిలాగే మీడియా ప్రతినిధులు, చంద్రబాబు అనుకూల మీడియా కూడా కొన్ని రాసి మరికొన్ని వదిలేసింది.

జూమ్‌లో మాట్లాడిన ఇవే విషయాలు అసెంబ్లీలో మాట్లాడలేం. కొన్ని మాట్లాడినా అధికార పార్టీ నేతల నుంచి కౌంటర్లు వస్తాయి. అచ్చెం నాయుడు అరెస్ట్‌ అక్రమం అంటే.. ఈఎస్‌ఐ అవినీతి అంటూ ఆధారాలతో సహా చూపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జేసీ ప్రభాకర్‌ రెడ్డిని అన్యాయంగా వేధిస్తున్నారందాంమంటే.. బీఎస్‌ 3 వాహనాలను బీఎస్‌ 4గా ఎలా మార్చారో, తుక్కు వాహనాలను తెచ్చి లారీలుగా ఎలా మార్చారో సాక్షాధారాలతో నిరుపిస్తామంటూ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ముందు చెప్పారు. జూమ్‌లో చెప్పినట్లు అప్పులు చేస్తున్నారని అసెంబ్లీలో మాట్లాడదామంటే.. మీ హాయంలో చేసిన 2.50 లక్షల కోట్ల అప్పులు మాటేమిటని అంటారాయే. ఏదో ఒక లాగా ప్రభుత్వంపై విమర్శలు, అవినీతి ఆరోపణలు చేద్దామని ప్రయత్నించినా తన హాయంలో జరిగిన వ్యవహారాలను వీడియోలు వేసి మరీ ఎండగడుతున్నారు.

అందుకేనేమో అసెంబ్లీ కన్నా జూమ్‌ ముద్దు అని చంద్రబాబు అనుకున్నట్లుగా ఉంది. ఇక్కడైతే ఏమైనా మాట్లాడొచ్చు. అడ్డేలేదు. అడ్డు చెప్పేవారులేరు. కౌంటర్లు అసలే ఉండవు. బాధ్యత గల ప్రతిపక్షంగా రాష్ట్ర బడ్జెట్‌ను సభలో పెడుతున్న సమయంలో అక్కడ లేకపోవడం ఎంత వరకు సమంజసమని అధికార పార్టీ సభ్యులుగానీ, మీడియాగానీ ప్రశ్నిస్తే.. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, రాజా రెడ్డి రాజ్యాంగం, పులివెందుల చట్టం అమలు చేస్తున్నారని తిరిగి విమర్శలు చేయవచ్చు. జూమ్‌ వల్ల ఎటు చూసినా లాభమే అయినప్పుడు అసెంబ్లీలో ఉండడం ఎందుకు దండగ.!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి