iDreamPost

అంతులేని అసహనం..!

అంతులేని అసహనం..!

ఎన్నికల్లో ఓటమి తరువాత నేతల్లో అసహనం ఉండడం సహజం. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి దీని పాలు కాస్తంత ఎక్కువైందంటున్నారు పరిశీలకులు. తమ పార్టీ లోపాలు చర్చించుకోవాల్సిన వేదికలపై కూడా అధికార పక్ష నేతలను తూలనాడుకునే స్థాయికి ఈ అసహనం పెరిగిపోయిందటూ ఉదాహరణలతో కూడిన వివరణలు ఇస్తున్నారు. రాష్ట్రానికి వచ్చినప్పటికీ నాయకుల్ని నేరుగా కలవడం మానేసిన చంద్రబాబు జూమ్‌లతోనే కాలక్షేపం చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివి ధ పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలతో జరుగుతున్న సమావేశాల్లో ఏపీ సీయం వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేసేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తుండడంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

పార్టీ నిలబడాలంటే ఏం చేయాలి? జరిగిన పొరపాట్లు ఎలా సరిదిద్దుకుందాం? భవిష్యత్తు వ్యూహం ఏంటి? ఇత్యాధి చర్చ జరగాల్సిన చోట అధికార పక్ష నేతపై విమర్శలకు ప్రాధాన్యమివ్వడం ద్వారా ఉపయోగమేంటని చర్చించుకుంటున్నారు. ఇవే విమర్శలు ఎన్నికల ప్రచారంలో చేసినప్పటికీ ప్రజలు పట్టించుకోలేదని, అటువంటిది సొంత పార్టీ నాయకుల ముందు మరోసారి అదే కేసెట్‌ వేయడం ద్వారా ఏం ఆశిస్తున్నారో అర్ధం కావడం లేదని చెబుతున్నారు. గత అన్ని జూమ్‌ సమావేశాలకు మాదిరిగానే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో సైతం సీయం జగన్‌ను ఆడిపోసుకునేందుకే చంద్రబాబు పెద్దపీఠ వేసారట. నేనుగొప్పగా పరిపాలించాను.. ఇప్పుడు పరిపాలన సరిగా జరగడం లేదంటూ పోలికల ప్రస్తావనలు కూడా చోటు చేసుకోవడంతో ఆ సమావేశంలో పాల్గొన్న నేతలు దిక్కులు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటున్నారు.

తమను గుక్కతిప్పుకోనీయని రీతిలో పాలన సాగిస్తున్న జగన్‌ను ఎదుర్కొవడానికి అనుభవాన్నంతా వాడుతున్నప్పటికీ పెద్దగా కన్పిస్తున్న ప్రయోజనం ఏమీ ఉండడం లేదు. మరో పక్క తనకు అండగా ఉంటారనుకున్న నేతలంతా నిష్క్రియాపర్వానికి మారిపోయారు. కనీసం తాను ఆదేశించిన పనులను కూడా పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాల్లేవు. అధికారంలో ఉండగా తనకు కళ్ళూ, చెవులూ తదితర ప్రధాన అవయవాల మాదిరిగానే వ్యవహరించిన వారు ఇప్పుడు తలోదారీ చూసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి జీవనాడిగా ఉండే సామాజికవర్గం కూడా ఇప్పుడు తమకు తగిన ప్రత్యామ్నాయం వైపు చూస్తోందన్న వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తోచని స్థితిలోనే సీయం వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు, ఆయన బృందంతో కలిసి తమ స్థాయికి తగని విమర్శలకు సైతం దిగుతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే ఈ తరహా రాజకీయం పార్టీని బ్రతికించగలిగేది కాదని, కేవలం ‘వెంటిలేటర్‌’ మాత్రమేని చెబుతున్నారు. విమర్శలు అనే వెంటిలేటర్‌ ఉన్నంత వరకు మాత్రమే ప్రజల్లో తమ ఉనికి అన్నది అర్ధమైపోవడంతోనే, వీలైనంత ఎక్కువగా వినియోగించుకుంటున్నారంటున్నారు. ఒక వేళ ఇదే గనుక వాస్తవం అయితే అన్ని దిక్కుల నుంచీ అనూహ్యంగా ఏర్పడుతున్న రాజకీయ పరిణామాలను ఎదుర్కొని టీడీపీని జనంలో నిలపడం చంద్రబాబుకు కత్తిమీద సామేనని వివరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి