iDreamPost

ఓట్ల కోసం చంద్రన్న పాట్లు

ఓట్ల కోసం చంద్రన్న పాట్లు

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ-జనసేన కూటమి నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీ కారణంగా.. గెలుపు ఆశలు ఎలాగు లేవు.. కనీసం రెండో స్థానమైనా దక్కుతుందో లేదోనన్న భయం టీడీపీ అధినేత చంద్రబాబును నేలకు దిగి సాము చేసే పరిస్థితికి తీసుకొచ్చింది. ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గ గల్లీల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఆయన పుత్రరత్నం, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గత వారం రోజులుగా ఇక్కడే మకాం వేసి ఉద్ధృత ప్రచారం చేస్తున్నారు. అయితే ఆయన ప్రసంగాల వల్ల పార్టీకి మైలేజ్ మాటేమో గానీ డ్యామేజ్ మాత్రం జరుగుతోందని కార్యకర్తలే ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇక లాభం లేదనుకుని చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు.

ఓట్ల కోసం రాలేదంటూనే..

ఒక ఉప ఎన్నికలో గెలిస్తే ఏం వస్తుంది? అందుకే నేను ఓట్ల కోసం రాలేదని తన ప్రసంగంలో ఊదరగొడుతున్న చంద్రబాబు మరోవైపు వీధి వీధినా తిరుగుతూ ప్రజలకు దండం పెడుతూ ఓట్లు ఆర్థిస్తున్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, పదేళ్లకు పైగా ప్రతిపక్ష నేతగా, జాతీయస్థాయిలో చక్రం తిప్పిన ఘనుడిగా తనకు తాను డప్పు కొట్టుకునే ఆయన ఇప్పుడు ఒక ఉప ఎన్నిక కోసం ఏకంగా 8 రోజులు ప్రచార షెడ్యూల్ పెట్టుకోవడం, నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచార వాహనం దిగి కాలినడకన వీధుల్లో పర్యటించడం చూస్తే ఓట్ల కోసం ఆయనెంత ఆరాటపడుతున్నారో అర్థమవుతుంది.

Also Read : తిరుపతి ఉప ఎన్నిక : ముందే చేతులెత్తిసిన అచ్చెం నాయుడు

సాధారణంగా ఉప ఎన్నికలను పార్టీ అధినేతలు, సీఎం స్థాయిలో పనిచేసిన నేతలు పెద్దగా పట్టించుకోరు. సాధ్యమైనంత వరకు తమ కింది స్థాయి నేతలకే ఆ బాధ్యతలు అప్పగిస్తారు. మరీ గట్టి పోటీ ఉన్నప్పుడు.. తప్పనిసరి అయితేనే ఒకటి రెండు సభల్లో ప్రసంగించి ప్రచారం చేస్తారు. కానీ తిరుపతిలో తమ రెండో స్థానానికే ముప్పు వాటిల్లే పరిస్థితి ఉండటంతో.. చంద్రబాబు తనస్థాయిని దిగజార్చుకొని వీధి ప్రచారానికి పూనుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లు, ప్రత్యేక ప్రచార వాహనాలతో ఆర్భాటంగా ప్రచారం చేసే అలవాటున్న చంద్రబాబు.. ఇప్పుడు ఓట్లు రావన్న భయంతో వీధుల్లో కాలినడకన పర్యటిస్తున్నారు.

పరిషత్ ఎన్నికల బహిష్కరణ కార్యకర్తల కోసమేనట!

ఇటీవలి పరిషత్ ఎన్నికల బహిష్కరణను చంద్రబాబు సమర్థించుకున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సర్వేపల్లిలో ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల క్షేమం కోసమే పరిషత్ ఎన్నికలను బహిష్కరించామని చెప్పుకొచ్చారు. కానీ అదే కార్యకర్తలు బహిష్కరణ వల్ల గ్రామాల్లో ఉనికి కోల్పోతామంటూ.. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి మరీ ఆ ఎన్నికల్లో పాల్గొన్న విషయాన్ని ఆయన పట్టించుకోలేదు. ‘మాకు పదవులు వచ్చే స్థానిక ఎన్నికలు అక్కర్లేదు గానీ.. మీకు పదవులు
ఇచ్చే ఎమ్మెల్యే ఎన్నికలు కావాలా’.. అన్న కార్యకర్తల ఆరోపణలను నిజం చేస్తూ.. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లోనే పాల్గొంటామని చంద్రబాబు స్పష్టం చేయడం అక్కడున్న కార్యకర్తలను ఆవాక్కయ్యేలా చేసింది.

ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీనే టార్గెట్ చేస్తున్న టీడీపీ అధినేత విభజన హామీలు అమలుకాకపోవడానికి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కు కారణమైన బీజేపీని మాత్రం పల్లెత్తు మాటనడంలేదు. పైగా వకీల్ సాబ్ సినిమా షోల విషయాన్ని ప్రస్తావిస్తూ పవన్ సినిమాపై ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోందని ఆరోపించడం ద్వారా జనసేనానిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Also Read : చంద్రబాబు కు తిరుపతి గ్రాండ్ ఫెయిల్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి