iDreamPost

మొనగాడు, కాదు మోసగాడు, కాదు కాదు ఆయన మహాను భావుడు

మొనగాడు, కాదు మోసగాడు, కాదు కాదు ఆయన  మహాను భావుడు

ఒకటే పార్టీ.. కానీ రెండేళ్లు తిరిగే లోగా మూడు స్వరాలు వినిపిస్తోంది. ఒకే నాయకుడి పట్ల విభిన్న గొంతులతో స్పందిస్తున్న తెలుగుదేశం పార్టీ తీరు విస్మయరంగా కనిపిస్తోంది. కానీ ఆ పార్టీ నేతలు బెరుకు లేకుండా వ్యవహరిస్తున్నారు. మోడీ అంతటి మొనగాడు లేడని చెప్పిన వాళ్ళే, ఆయనే పెద్ద మోసగాడు అంటూ నినదించారు. ఇప్పుడు మళ్లీ మహానుభావుడిగా కీర్తించడం మొదలు పెట్టారు.

2018 ఫిబ్రవరి వరకూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల టిడిపి నేతలు సానుకూలంగా వ్యవహరించారు. ఏపీ అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్నట్టు చెప్పుకొచ్చారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనలకే పొంగిపోయారు. ఏపీ కి నిధులు కేటాయిస్తామని చెప్పినందుకే ధన్యవాదాలు చెప్పేశారు. కానీ అంతలోనే మనసు మార్చుకున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్రం కావడంతో మోడీ పట్ల మండిపడ్డారు. ఆ పేరు ఎత్తితే చాలు చంద్రబాబు నుంచి చినబాబు వరకూ నేతలంతా విరుచుకుపడేవారు. మోడీ కి ఏపిలో అడుగుపెట్టే అర్హత లేదంటూ హోర్డింగులు పెట్టారు. ప్రధాని హోదాలో గుంటూరు వస్తే నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు. అన్నింటికీ మించి బాలకృష్ణ వంటి వారు నోటికి పని చెబితే, తిరుపతిలో అమిత్ షా కి రాళ్ళ స్వాగతం లభించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

కట్ చేస్తే, కాలం మారింది. మళ్లీ బాబు అండ్ కో స్వరం మారింది. తాజాగా అమరావతి ప్రాంతంలో రైతులు చేపట్టిన నిరసనల సందర్భంగా టీడీపీ నేతలు మరోసారి మోడీ కి జైజైలు పలుకుతున్నారు. అదే పనిగా తిట్టిన నేతలే ఇప్పుడు మోడీ మాత్రమే దిక్కు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ పట్ల మోడీ తీరులో మార్పు ఏమీ కనిపించలేదు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆయన పట్టించుకున్నదీ లేదు. కనీసం రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా నిధులు కేటాయించింది కూడా లేదు. ఏపి లాంటి కొత్త రాష్ట్రానికి అందించాల్సిన కేంద్ర సహాయంలో వివక్ష కొనసాగుతునే ఉంది. అయినా టిడిపి గొంతులో వచ్చిన మార్పు అనూహ్యంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతల చిత్తశుద్ధి ని జనం శంకించల్సి వస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెబుతూ, టీడీపీ నేతలు తమ ప్రయోజనాల కోసం పదేపదే మాట మారుస్తున్నరనే అభిప్రాయం బలపడుతోంది.

రాజకీయ పార్టీగా విధానాలను మార్చుకోవడం నేరం కాదు. కానీ అది ఎందుకనే విషయం ప్రజలకు స్పష్టం చేయాల్సి ఉంటుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటే జనం హర్షిస్తారు. కానీ దానికి భిన్నమైన రీతిలో ముందుకు సాగితే అసలుకే ఎసరు తప్పదు. నాయకుడు, పార్టీ మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిపోతుంది. సరికదా అలాంటి నిలకడ లేని వైఖరి ఉన్న వారితో స్నేహానికి మోడీ గానీ మరొకరు గానీ సంసిద్ధత తెలపలేరు. అదే ఇప్పుడు చంద్రబాబు కి చిక్కులు తెచ్చిపెడుతుంది. ఆయన ఎన్ని అడుగులు దిగుతున్నా కమలనాథులు కనికరించకపోవడానికి ఇది కూడా ఒక కారణమై ఉండవచ్చు. గతంలోనే పార్లమెంట్ వేదికగా జగన్ ట్రాప్ లో చంద్రబాబు పడ్డారని మోడీ చేసిన కామెంట్స్ గమనార్హం. తమ్ముళ్లు తెగ ఉబలాట పడుతున్నా కాషాయ దళం నుంచి కనీస స్పందన లేకపోవడం వెనుక కారణాలు అర్థమవుతాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి