iDreamPost

బాబుగారొచ్చారు..!

బాబుగారొచ్చారు..!

ఏపీకి బాబుగారొచ్చారు. అవును మీరు చదువుతుంది నిజమే. కరోనా వైరస్‌ భయాందోళనల మధ్య దాదాపు ఏడు నెలలుగా హైదరాబాద్‌లోని తన ఇంటికే పరిమితం అయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీకి వచ్చారు. కరోనా వైరస్‌ వెలుగుచూసినప్పటి నుంచి చుట్టం చూపుగా ఏపీకి వచ్చి వెళుతున్న చంద్రబాబు ఈ సారి కూడా అలానే వచ్చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటిస్తారని కొద్ది రోజులుగా ప్రసారం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ పని మీదనే చంద్రబాబు బుధవారం సాయంత్రం కృష్ణ నది కరకట్ట వెంబడి ఉన్న తన నివాసానికి చేరుకున్నారు.

కరోనా వైరస్‌ ప్రారంభమయ్యాక ఇప్పటి వరకూ చంద్రబాబు.. నాలుగు సార్లు ఏపీకి వచ్చారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ విషవాయువు లీకేజీ ఘటనలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించేందుకని మొదటి సారి లాక్‌డౌన్‌లో అనుమతి తీసుకున్న చంద్రబాబు వారిని పరామర్శించకుండా.. జూమ్‌ యాప్‌ ద్వారా వర్చువల్‌ మహానాడును నిర్వహించుకుని రెండు రోజుల్లో మళ్లీ హైదరాబాద్‌ వెళ్లారు. ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్‌ అయిన ఫైల్స్‌ కారణంగా గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అచ్చెం నాయుడును పరామర్శించేందుకు రెండో సారి వచ్చారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెం నాయుడు, హత్య కేసులో కొల్లు రవీంద్రలు బెయిల్‌పై విడుదలయిన తర్వాత వారిని పరామర్శించేందుకు ముచ్చటగా మూడోసారి ఏపీకి విచ్చేశారు. తాజాగా టీ డీపీ ఏపీ కమిటీ నియామకం ప్రకటించేందుకు నాలుగోసారి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టారు.

ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఎవరు..? కమిటీలో ఎవరెవరికి చోటు దక్కబోతోందన్న అంశంపై కొన్ని రోజులుగా ఓ వర్గం మీడియా కథనాలు వండివారుస్తోంది. టీడీపీకి హైప్‌ పెంచేందుకు, ఏపీ అధ్యక్ష పదవికి పోటీ ఉన్నట్లు ప్రజలకు చూపించేందుకే ఈ తరహా వ్యూహాన్ని చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే అచ్చెం నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, రామ్మోహన్‌ నాయుడుల పేర్లను ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు ప్రచారం చేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు కూడా ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు ఏపీకి రావడంతో ఈ అంశానికి తెరపడనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి