iDreamPost

జనాన్ని భయపెడుతున్న చెడ్డీ గ్యాంగ్‌ సూత్రధారి అతడే..

జనాన్ని భయపెడుతున్న చెడ్డీ గ్యాంగ్‌ సూత్రధారి అతడే..

గత కొద్దిరోజులుగా నగరంలో చెడ్డీ గ్యాంగ్‌ సంచరిస్తున్న సంగతి తెలిసిందే. మియాపూర్‌, అమీన్‌పూర్‌ ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్‌ కలకలం సృష్టించింది. ఈ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దృశ్యాలు సీసీ రికార్డై.. అవి కాస్తా వైరల్‌గా మారాయి. చెడ్డీ గ్యాంగ్‌ మియాపూర్‌లోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడింది. బంగారంతో పాటు ఇతర విలువైన అభరణాలను దోచుకెళ్లింది. ఇక, లింగపల్లిలోనూ చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రంగలోకి దిగారు. పక్కా ప్లాన్‌తో చెడ్డీ గ్యాంగ్‌లోని ఓ సభ్యుడ్ని అదుపులోకీ తీసుకున్నారు. అతడి వద్దనుంచి వివరాలను సేకరిస్తున్నారు. మిగిలిన సభ్యుల గురించి అడిగి తెలుసుకుంటున్నారు.

చెడ్డీ గ్యాంగ్‌ గుజరాత్‌నుంచి హైదరాబాద్‌ వచ్చిందని పోలీసులు తెలిపారు. మియాపూర్‌లో జరిగిన చోరీలో ముకేశ్‌ భాయ్‌, భరుభాయ్‌, విక్రమ్‌బాయ్‌, నితిన్‌ భాయ్‌, సర్మల్‌లు పాల్గొన్నట్లు వెల్లడించారు. భరభాయ్‌ని తాజాగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సర్మల్‌ను గుజరాత్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారని వెల్లడించారు. విక్రమ్‌ భాయ్‌ నగరంలో ప్లంబర్‌గా పని చేస్తూ ఉన్నాడని, చోరీల కోసం మిగితా ముగ్గుర్ని అతడే హైదరాబాద్‌కు పిలిపించాడని అన్నారు. విక్రమ్‌ను చెడ్డీ గ్యాంగ్‌ సూత్రధారిగా గుర్తించినట్లు తెలిపారు. ప్లంబర్‌ అవతారం ఎత్తిన విక్రమ్‌ రెక్కీలు నిర్వహించేవాడన్నారు. ఆగస్టు 5కు ముందే విక్రమ్‌..

అమీన్‌పూర్‌లో కొన్ని ఇళ్లను దొంగతనం కోసం సెలెక్ట్‌ చేశాడని తెలిపారు. ముఠా సభ్యులంతా ఎవరి కంటా పడకుండా సాయంత్రం వరకు అటవీ ప్రాంతంలో గడిపారని, రాత్రి అయ్యాక దొంగతనానికి వెళ్లారని తెలిపారు. తాళం వేసి ఉన్న ఇళ్లలో మాత్రమే వీరు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. దొంగతనం చేసిన తర్వాత వీరంతా మళ్లీ గుజరాత్‌కు తిరిగి వెళ్లిపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సర్మల్‌ అరెస్ట్‌ అయ్యాడని తెలిపారు. మరి, హైదరాబాద్‌ నగరంలో కలకలం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్‌లోని ఓ సభ్యుడు పోలీసులకు చిక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి